Urea Shortage In Telangana: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం యూరియా సంక్షోభంలో చిక్కుకుంది. విస్తారం వర్షాలు పడుతున్న ఈ సమయంలో రైతులు యూరియా కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారని, వ్యాపారస్తులు సైతం కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన వాటా కేటాయించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ఎండగడుతూ, ఒకవైపు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు డిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తీసుకోవచ్చే పనిలో ఉండగా, రాష్ట్రంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టీ రాష్ట్రం నుంచి ప్రతినిధి వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి తీసుకురావాల్సిన యూరియా కేటాయింపులను తీసుకు రావడంలో విఫలమయ్యారని, రైతుల బాధలు పట్టించుకోవడం లేదని విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ యూరియా నిల్వలను ఏవిధంగా ఉపయోగించుకోవాలని విషయాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణరావుతో కలిసి కలెక్టర్లతో హుటాహుటిన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ‘గీతాంజలి’ హీరోయిన్ లేటెస్ట్ లుక్ ని చూసి కంగుతిన్న నాగార్జున..లైవ్ లో ఊహించని సర్ప్రైజ్!
*ఎందుకీ పరిస్థితి*
జూలై, ఆగస్టు నెలలో మంచి వర్షాలు కురువడం వల్ల రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, పప్పు దినుసులు వంటి అనేక రకాల పంటలు రైతులు ఒకేసారి సాగు చేయడం, మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా స్టాక్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వంటి వివిధ కారణాలని ప్రభుత్వం చెబుతోంది.
*యూరియా దిగుమతులు తగ్గడం వల్లనే..*
చైనా, జర్మనీ, ఇరాన్, యుమాన్ వంటి పలు దేశాల నుంచి రావాల్సిన యూరియా సరఫరా కావడం లేదు. ఏప్రిల్ నెల నుంచి కేటాయింపుల మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా కాలేదని, మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల తక్కువ సరఫరా జరిగిందని మంత్రి తెలిపారు.
మన దగ్గర గతంలో ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ తో రైతులకు ఇప్పటి వరకు కొంత మేర సరఫరా చేసామని తెలిపారు.
*కృత్రిమ కొరతకు చెక్*
మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించాలన్నారు. ప్రస్తుతం ప్రైవేటు డీలర్ల వద్ద 35 వేల మెట్రిక్ టన్నుల
యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, అది సక్రమంగా విక్రయం జరగాలన్నారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలకు యూరియా డైవర్ట్ కావడానికి వీలు లేదని, రైతులు అధికంగా స్టాక్ పెట్టుకోవద్దని, అవసరం మేరకే కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
*యూరియా సరఫరా ఎందుకు కావడం లేదు*
జియో పొలిటికల్ కారణాల వల్ల దేశానికి యూరియా సరఫరా సరఫరా దెబ్బతిందని, రామగుండం ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్ లో సాంకేతిక కారణాలవల్ల ఉత్పత్తి పలుమార్లు నిలిచిపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ఎరువుల సరఫరాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కోత ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే నేటికి లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అదనంగా రైతులకు సరఫరా చేశామని ప్రభుత్వం చెబుతున్నది.
రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వీలైనంత అధికంగా యూరియా తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
*అక్రమ తరలింపులు*
వ్యవసాయం కోసం కేటాయించిన యూరియాను పారిశ్రామిక అవసరాల కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఉంది. వీటిని కట్టడి చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలకు పూనుకుంది. యూరియా, ఇతర ఎరువుల లభ్యత వివరాలను కలెక్టర్లు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్, ప్రైవేట్ కంపెనీల వద్ద మండల స్థాయి వరకు స్టాక్ ఎంత ఉందో రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని,
మండలాల వారీగా సాగుకు అనుగుణంగా ఎరువుల స్టాక్ సమర్థవంతంగా , శాస్త్రీయంగా కేటాయింపు చేయాలని సూచించారు. ప్రతిరోజు జిల్లాలకు ఎరువుల రేక్ స్టాక్ ఎంత వరకు రాబోతున్నాయి వంటి అంశాలను కలెక్టర్ కు ముందస్తుగా తెలియజేస్తామని కూడా తెలిపారు.
*ఆకస్మిక తనిఖీలు*
ప్రైవేట్ ఎరువుల డీలర్ల షాపులను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. యూరియా అవసరం ఉన్న పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వ్యవసాయ సంబంధిత ఎరువులను పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూన్, జూలై నెలల్లో అధికంగా యూరియా కొనుగోలు చేసిన బయ్యర్స్, రెగ్యులర్ గా కొనుగోలు చేసే బయ్యర్స్ వివరాలను ట్రాక్ చేయాలని, వీరు ఎక్కడైనా యూరియా డైవర్ట్ చేస్తున్నారా అని కూడా పరిశీలించాలన్నారు. జిల్లాలలో అవకాశం ఉన్న చోట ప్రత్యామ్నాయంగా డ్రోన్ ద్వారా నానో యూరియా, డిఏపి కాంప్లెక్స్ ప్రోత్సహించాలని
కూడా తెలిపారు.
*సరిహద్దులపై నిఘా*
ఆదిలాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, నారాయణ పేట వంటి సరిహద్దు జిల్లాలో ఇతర రాష్ట్రాల రైతులకు యూరియా అమ్మకుండా చూడాలని, మన స్టాక్ బ్లాక్ మార్కెట్ కాకుండా బోర్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు.