Uppala Malsur Life: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతోంది. శనివారంతో తొలి విడత నామినేషన్లకు గడువు ముగియనుంది. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుంచే అనేక మంది జెడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అయితే సూర్యాపేట జిల్లా సిరికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ మాత్రం ఎమ్మెల్యేగా చేసి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1952 నుంచి 1972 వరకు నాలుగుసార్లు సూర్యాపేట శాసనసభ సభ్యుడిగా గెలిచారు ఉప్పల మల్సూర్. 1990లో సొంత గ్రామంలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజలు ఒక్కసారి ఒప్పించి ఆయనను ఎంపిక చేసిన ఈ సంఘటన రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది.
రాజకీయ జీవితంలో మైలురాళ్లు
సీపీఎం పార్టీ తరఫున 1952–56, 1962–72 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్సూర్, మీసా చట్టం కింద జైలు శిక్ష అనుభవించారు. ప్రజా హక్కుల సాధన కోసం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్‌పై ప్రజల సమస్యలు పరిష్కరించి, ‘ఇంక్ ప్యాడ్ ఎమ్మెల్యే’గా పేరు పొందారు.
ప్రజాసేవా కోసం..
20 ఏళ్ల శాసనసభ సభ్యత్వం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, సిరికొండ సర్పంచ్‌గా గ్రామ సేవలు అందించారు. వ్యక్తిగత ఆస్తులు తిరస్కరించి, వారసత్వ భూములను పాఠశాలకు దానం చేశారు. రైతు కూలీలు, భూపట్టాలు, కొలతల పరిష్కారాల్లో ముందుండి, కమ్యూనిస్టు ఆదర్శాలకు కట్టుబడి జీవించారు.
చరిత్రలో చిరస్థాయిగా..
ఆయన కుటుంబం ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం రాజకీయాల్లో స్వార్థరహిత సేవా మార్గాన్ని గుర్తుచేస్తోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా సొంత ఇల్లు లేకపోవటం ప్రజాసేవకు అమోఘ ఉదాహరణగా నిలిచింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన జీవితం ప్రజల్లో స్ఫూర్తి రేపుతోంది.