HomeతెలంగాణTelangana Panchayat Elections: తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు మంగళం..

Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు మంగళం..

Telangana Panchayat Elections: తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసి 20 నెలలు కావస్తోంది. జిల్లా, మండల పరిషత్‌ పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర దాటింది. అయినా ఎన్నికల నిర్వహణకు రేవంత్‌ సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. మొన్నటి వరకు హామీలు అమలు చేయకపోవడంతో ఓటమి భయం పట్టుకుంది. ఇప్పుడు రిజర్వేషన్ల పంచాయితీ ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు హైకోర్టు గడువు తరుముకొస్తోంది. సెప్టెంబర్‌ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (బీసీ) కోసం 42% రిజర్వేషన్‌లను అమలు చేసే బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండటం వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ బిల్లులకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావంతో ప్రభుత్వం ఉంది.

ఆలస్యం ఎందుకు?
తెలంగాణ శాసనసభ ఆగస్టు 31 తెలంగాణ పంచాయతీ రాజ్‌ (తృతీయ సవరణ) బిల్లు, 2025, తెలంగాణ మున్సిపాలిటీస్‌ (తృతీయ సవరణ) బిల్లు, 2025ను ఆమోదించింది. ఈ బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ను అమలు చేయడానికి, సుప్రీం కోర్టు నిర్దేశించిన 50% రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేయడానికి ఉద్దేశించినవి. అయితే, ఈ బిల్లులు గతంలో జారీ చేసిన ఒక ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్‌ ద్వారా పంపబడ్డాయి, ఇవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆలస్యం ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టం చేస్తోంది, ఎందుకంటే రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది.

తరుముకొస్తున్న హైకోర్టు గడువు..
తెలంగాణ హైకోర్టు జూన్‌ 25న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంను సెప్టెంబర్‌ 30లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో ఎన్నికైన పంచాయతీల ఐదేళ్ల పదవీ కాలం జనవరి 31న ముగిసింది. ఈ ఆలస్యం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ఈ, 243కె, తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం, 2018ను ఉల్లంఘించినట్లు పిటిషనర్లు వాదించారు. ఈ ఆలస్యం వల్ల గ్రామీణ పాలనలో అంతరాయం ఏర్పడింది, స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం రాజ్యాంగ విరుద్ధమని వాదనలు వచ్చాయి. కోర్టు ఈ ఆలస్యాన్ని ‘న్యాయంగా సమర్థించలేనిది‘గా అభివర్ణించింది. రిజర్వేషన్‌ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ గడువును పొడిగించాలని కోరుతోంది.

పంచాయతీ ఎన్నికల ఆలస్యం తెలంగాణలోని 12,778 గ్రామ పంచాయతీలలో పాలనా సంక్షోభానికి దారితీసింది. ఫిబ్రవరి 2024 నుంచి స్పెషల్‌ ఆఫీసర్లు గ్రామీణ పాలనను నిర్వహిస్తున్నారు, ఇది సమర్థవంతంగా లేదని, గ్రామీణ సేవలపై ప్రభావం చూపుతోందని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు, ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్నికైన స్థానిక సంస్థలు లేనందున ఆగిపోయాయి. ఇది గ్రామీణాభివృద్ధిని దెబ్బతీసింది. సర్పంచ్‌లు వ్యక్తిగత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, వాటికి రీయింబర్స్‌మెంట్‌ లభించకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular