Homeజాతీయం - అంతర్జాతీయంRussia India Relations: భారత్ కు మరిన్ని బ్రహ్మాస్త్రాలు.. ఇక పాక్ కు వణుకే

Russia India Relations: భారత్ కు మరిన్ని బ్రహ్మాస్త్రాలు.. ఇక పాక్ కు వణుకే

Russia India Relations: ఒకవైపు పాకిస్తాన్‌.. మరోవైపు చైనా.. ఇంకోవైపు బంగ్లాదేశ్‌.. తాజాగా అమెరికా టారిఫ్‌ వార్‌.. ఇలాంటి తరుణంలో భారత్‌ కూడా తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సరికొత్త ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ముఖ్యంగా గగనతల వ్యవస్థ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో సుదర్శనచక్రం సిద్ధం చేసిన భారత్‌.. రష్యాకు చెందిన ఎస్‌–400 ఆయుధాలను మరిన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడం ద్వారా ఎస్‌–400 తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ విజయం భారతదేశాన్ని అదనపు ఎస్‌–400 యూనిట్ల సేకరణ వైపు నడిపించింది.

ఆపరేషన్‌ సిందూర్‌లో ఎస్‌–400 సక్సెస్‌..
2025 మేలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా, భారత వైమానిక దళం ఎస్‌–400 వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్‌ యొక్క డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది. ఈ ఆపరేషన్‌లో, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్‌ వంటి ప్రాంతాలలోని వ్యూహాత్మక స్థావరాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయం భారత రక్షణ వ్యవస్థలో ఎస్‌–400 విశ్వసనీయతను పెంచింది. రష్యా నుంచి మరిన్ని యూనిట్ల కోసం చర్చలకు ఊతం ఇచ్చింది. ఈ వ్యవస్థ యొక్క 600 కి.మీ. పరిధిలో లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం, 100 లక్ష్యాలను ఏకకాలంలో ట్రాక్‌ చేయగల సామర్థ్యం దాని విశిష్టతను చాటుతుంది.

రష్యా–ఉక్రెయిన్‌ వార్‌తో ఆలస్యం..
2018లో భారత్‌ రష్యాతో 5.43 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని ఐదు ఎస్‌–400 స్క్వాడ్రన్లను సేకరించింది. వీటిలో మూడు ఇప్పటికే అందాయి. వాటిని పంజాబ్, లడఖ్, సిలిగురి కారిడార్‌లలో మోహరించాయి. రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణ కారణంగా మిగిలిన రెండు స్క్వాడ్రన్ల సరఫరా 2026 వరకు ఆలస్యమైంది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌లో ఎస్‌–400 యొక్క ప్రదర్శన భారతదేశాన్ని అదనపు యూనిట్ల కోసం చర్చలు ప్రారంభించేలా ప్రేరేపించింది. రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ మిలిటరీ–టెక్నికల్‌ కోఆపరేషన్‌ అధిపతి డిమిత్రి షుగేవ్, ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, అయితే సహకారం పెంచే అవకాశం ఉందని సూచించారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య చర్చలు రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలపరిచాయి. ఎస్‌–400 అదనపు సరఫరాపై ఒప్పందం కుదిరితే, భారతదేశం దాని ఆకాశ రక్షణను మరింత బలోపేతం చేసుకుని, దేశవ్యాప్తంగా వ్యూహాత్మక స్థానాల్లో ఈ వ్యవస్థలను మోహరించే అవకాశం ఉంది. ఇది చైనా జే–20 స్టెల్త్‌ ఫైటర్లు, పాకిస్తాన్‌ వైమానిక శక్తులను సమర్థవంతంగా నిరోధించగలదు. దీంతో భారత్‌ దక్షిణాసియాలో రక్షణ ఆధిపత్యాన్ని స్థాపించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular