Kadiyam Kavya: పుండు మీద కారం చల్లి వెళ్లిన కావ్య.. ఆ లేఖతో కారు పార్టీలో కలకలం

కడియం కావ్య రాజీనామా చేసిన నేపథ్యంలో.. అదే బాటలో మిగతావారు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి పార్టీని వదిలిపెట్టి వెళ్తారని.. పోటీ నుంచి వై దొలుగుతారని ప్రచారం జరుగుతున్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 30, 2024 4:42 pm

Kadiyam Kavya

Follow us on

Kadiyam Kavya: వరంగల్ పార్లమెంటు స్థానంలో భారత రాష్ట్ర సమితి తరఫున తాను పోటీ చేయబోనని కడియం కావ్య ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. స్వయంగా కేసీఆర్ ఆమె పేరును వరంగల్ పార్లమెంటు స్థానానికి ప్రకటించారు. కావ్య కూడా ఐదు రోజుల క్రితం కేసీఆర్ ను కలిశారు. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులతో విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. అంతా బాగుంటుందనుకుంటున్న క్రమంలో హఠాత్తుగా ఆమె బాంబు పేల్చారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు.

పోటీ నుంచి విరమించుకోవడమే కాదు.. కడియం కావ్య కేసీఆర్ కు సుదీర్ఘంగా లేఖ రాశారు. భారత రాష్ట్ర సమితిలో అక్రమాలు పెరిగాయని, భూ దందాలు, కబ్జాలు వంటివి చోటు చేసుకుంటున్నాయని..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్టీని ప్రజల్లో చులకన చేస్తోందంటూ కావ్య లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. కావ్య తను పోటీ నుంచి వైద్యులుతున్నట్టు ప్రకటించడంతో భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. భారత రాష్ట్ర సమితిలో ఉండాలా? వెళ్లిపోవాలా? ఒకవేళ పార్టీలో ఉన్నప్పటికీ పోటీ నుంచి తప్పుకుంటే మంచిదా? అనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

కడియం కావ్య రాజీనామా చేసిన నేపథ్యంలో.. అదే బాటలో మిగతావారు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి పార్టీని వదిలిపెట్టి వెళ్తారని.. పోటీ నుంచి వై దొలుగుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే అది పుకారు మాత్రమేనని ఆ అభ్యర్థి అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఏర్పాటులో ఉంటారో చెప్పలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక కేసీఆర్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి మీద ప్రజల్లో వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. పైగా కేసీఆర్ కుటుంబం పై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఓ నాయకుడు ఉన్నాడని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేస్తే బాగుంటుందా? ఎన్నికల్లో గెలుస్తామా? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందా? అనే డైలమాలో అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇంతకుమించి ఉత్తమ అవకాశం వస్తే అందులోకి వెళ్లాలనే ఆలోచన నాయకులు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కావ్య రాజీనామా తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న మొదలైంది. బాబూ మోహన్ కు టికెట్ ఇస్తారని, లేదు లేదు తాటికొండ రాజయ్యను మళ్ళీ పిలుస్తున్నారని, ఇంకా కొంతమంది నాయకులు లైన్లో ఉన్నారని, హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారని.. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. మొత్తానికి కావ్య పుండు మీద కారం చల్లడంతో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పరేషాన్ లో ఉన్నారు.