Munugode Constituency: వెలుగు పత్రిక వెబ్ ఎడిషన్ లో బెల్ట్ తీశారు అని ఒక కథనం ప్రచురితమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు అందుకొని ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది స్వచ్ఛందంగా తమ బెల్ట్ షాపులు మూసివేశారట. ఆ షాపులు మొత్తం దాదాపు 2000 దాకా ఉంటాయట. ఒక మారుమూల మునుగోడు నియోజకవర్గంలోనే 2000 బెల్ట్ షాపులు ఉంటే.. ఇక తెలంగాణ లో మొత్తం పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. చివరికి గత ప్రభుత్వం ఆమ్దానికోసం గడువుకు ముందే వైన్ షాపులకు లైసెన్సులు ఇచ్చింది. అంతేకాదు ఇబ్బడి ముబ్బడిగా బార్లకు అనుమతి కూడా ఇచ్చింది. అందువల్లే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మధ్యదరా సముద్రం పొంగింది. చివరికి మద్యం విక్రయాలు లక్ష్యాన్ని దాటే విధంగా ఆబ్కారి అధికారులకు ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేయడంతో గత పది సంవత్సరాలు మద్యం ఏరులై ప్రవహించింది. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఏ స్థాయిలో మద్యం కొనుగోళ్ళు జరిగాయో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెల్ట్ షాపులు మూసేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే చాలామంది పసుపుతాళ్ళు నిలబడతాయి. లేకుంటే వారి భర్తలు తాగే మద్యం డబ్బులే సర్కార్ కు ఆదాయం అవుతాయి.
ఒక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేలల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులో నుంచి మద్యాన్ని ఈ బెల్ట్ షాపుల నిర్వాహకులు తీసుకోవడం.. వైన్ షాపులు మూసివేసినా సరే మందుబాబులకు మద్యాన్ని అందుబాటులో ఉంచడం వీరి పని. అంటే
ఎనీ టైం మద్యం అన్నమాట. పైగా ప్రభుత్వమే ప్రోత్సహించడంతో ఈ మందు దందా దర్జాగా సాగింది. మద్యానికి అలవాటు పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకొంతమంది రోగాల బారిన పడ్డారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల నిర్వాహకుల ఆగడాలు తగ్గిపోలేదు. పైగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త టార్గెట్లు విధిస్తుండడంతో.. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల నిర్వాహకులకు మరింత అదనంగా మద్యాన్ని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా లిక్కర్ ఆదాయం గడిచిన సంవత్సరాలలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఈ బెల్ట్ షాపుల వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చాయని.. అందుకే వాటిని మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు.. అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తేనే బాగుంటుందని అభిప్రాయాలు మహిళల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సింహభాగం ఆదాయం మద్యం ద్వారా వస్తున్న నేపథ్యంలో.. మరి దానిపై ఎలా నిషేధం విధిస్తుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లైసెన్సులు ఇవ్వడం వల్ల.. ఒక్కో మండలంలో గరిష్టంగా మూడు నుంచి ఐదు వరకు వైన్ షాపులు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీలలో, నగరాలలో అదనంగా బార్ షాపులు కూడా ఏర్పాటయ్యాయి. ఫలితంగా వీటి ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 31 నాడు వందల కోట్ల మద్యం విక్రయమైందంటే ఎన్ని షాపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ నగదు మొత్తం అధికారిక రికార్డుల ప్రకారమే. ఇంకా అనధికారికంగా ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 2000 బెల్ట్ షాపులు మూసివేశారు. అయితే రాష్ట్ర మొత్తం కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కాంగ్రెస్ పార్టీ బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని.. వైన్స్ సంఖ్యను కూడా తగ్గించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.