TV9 Vs NTV: టీవీ9 పునాదులు కదిలిస్తోన్న ఎన్టీవీ

ఇక ఆ మధ్య నెంబర్ వన్ స్థానంలోకి వచ్చినప్పుడు సంబరాలు నిర్వహించిన టీవీ9.. కొద్దికాలానికే ఆ స్థానాన్ని మళ్లీ ఎన్టీవీ కి అప్పగించింది. అయితే నెంబర్ వన్ స్థానాన్ని ఇంకెప్పుడు టీవీ9 యాజమాన్యానికి అప్పగించకూడదు అని అనుకున్నాడు ఏమోగానీ.

Written By: K.R, Updated On : July 7, 2023 5:29 pm

TV9 Vs NTV

Follow us on

TV9 Vs NTV: మొన్ననే మనం చెప్పుకున్నాం కదా టీవీ 9 ఇప్పట్లో ఎన్ టి విని కొట్టెయ్యలేదని.. రజనీకాంత్ కేటీఆర్ లాంటి వ్యక్తిని తీసుకువచ్చి ప్రైమ్ టైం ఇంటర్వ్యూ నిర్వహించినప్పటికీ దాని జిఆర్పి రేటింగ్స్ ఇప్పట్లో లేచే పరిస్థితి లేదని.. అనుకున్నట్టుగానే జరుగుతున్నది. టీవీ9 మేనేజ్మెంట్ కు ఇతర వ్యాపకాలు ఉండటం, రజనీకాంత్ కు చానల్ ను ఎలా నిర్వహించడం తెలియకపోవడం పెద్ద మైనస్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో రజినీకాంత్ కు కుడి ఎడమ భుజాలుగా ఉన్న వేములపల్లి అశోక్, దొంతు రమేష్ బయటకు వెళ్లిపోయారు. వీరిలో దొంతు రమేష్ నరేంద్ర చౌదరి ఎన్టీవీ క్యాంపులో చేరిపోయాడు. వేములపల్లి అశోక్ బిగ్ టీవీ అనే న్యూస్ ఛానల్లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరిపోయాడు. వాస్తవానికి వీళ్ళిద్దరూ వెళ్లిపోయారు అనేకంటే బయటకి వెళ్ళిపోయేలా చేశారు అనడం ఉత్తమం.

ఇక ఆ మధ్య నెంబర్ వన్ స్థానంలోకి వచ్చినప్పుడు సంబరాలు నిర్వహించిన టీవీ9.. కొద్దికాలానికే ఆ స్థానాన్ని మళ్లీ ఎన్టీవీ కి అప్పగించింది. అయితే నెంబర్ వన్ స్థానాన్ని ఇంకెప్పుడు టీవీ9 యాజమాన్యానికి అప్పగించకూడదు అని అనుకున్నాడు ఏమోగానీ.. నరేంద్ర చౌదరి దాని పునాదుల మీదనే దెబ్బ కొట్టడం ప్రారంభించాడు. ఇప్పటికే టీవీ9 లో పనిచేస్తున్న కీలక ఉద్యోగులను తన వైపుకు లాగాడు. వారికి కనివిని ఎరుగని స్థాయిలో వేతనాలు ఇస్తున్నాడు. వారు మాత్రమే కాకుండా టీవీ9 డిజిటల్ విభాగంలో పనిచేసే వారు కూడా ఎన్టీవీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఎన్ టీవీ ని కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతి భాషల్లోనూ విస్తరించాలని నరేంద్ర చౌదరి లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇక శాటిలైట్ ఛానల్ విషయాన్ని పక్కన పెడితే అపార అవకాశాలు, ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న డిజిటల్ విభాగంలోనూ సత్తా చాటాలని ఎన్టీవీ యాజమాన్యం యోచిస్తోంది. అయితే ఈ విభాగంలో ఎన్టీవీ టీవీ9 కంటే వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. అయితే ఈ డిజిటల్ విభాగంలో టీవీ9 కు వెన్ను దన్నుగా ఉన్న ఉద్యోగులను గుర్తించిన ఎన్టివి యాజమాన్యం.. వారికి భారీ మొత్తంలో ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కీలక ఉద్యోగులు ఎన్టీవీ వైపు వెళ్లిపోయారని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన నెంబర్ వన్ స్థానం మీదనే కాదు టీవీ9 పునాదుల మీదే నరేంద్ర చౌదరి గట్టిగా కాన్సన్ట్రేషన్ చేశాడని తెలుస్తోంది. ఇక మొన్నటి దాకా కుట్రలతో నెంబర్ వన్ స్థానం లాక్కోలేరని ప్రచారం చేసిన టీవీ9..ఇప్పుడు ఏ ట్యాగ్ లైన్ ను ఎంచుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.