https://oktelugu.com/

Thummala Nageswara Rao: ఇదీ తుమ్మల రాజకీయ ప్రస్థానం

తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందిన ప్రతి సారి ఆయనను మంత్రి పదవులు వరించాయి. సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించటం, నిజాయితీపరుడిగా పేరుండటంతో తుమ్మలను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి.

Written By: , Updated On : December 8, 2023 / 09:05 AM IST
Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Follow us on

Thummala Nageswara Rao: సామాన్య కార్యకర్తగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి నాలుగు దశాబ్దాలుగా తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు మరో సారి మంత్రి పదవి దక్కింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయంలో సామాన్య కార్యకర్తగా ఆ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటు పోట్లను కూడా ఎదుర్కొన్నారు. ఓటమి, గెలుపును చవి చూసిన తుమ్మల నాగేశ్వరరావు గెలిచిన ప్రతి సారి మంత్రి పదవులు వరించాయి. 2014లో ఓటమి పొందిన తరువాత కూడా ఆయనను మంత్రి పదవి వరించటం ద్వారా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.

సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్థానం….

ఈ నియోజకవర్గంలో అప్రతిహతంగా సాగుతున్న జలగం వెంగళరావు కుటుంబ సభ్యుల హవాను నివలరించేందుకు ఆ రోజుల్లో కమ్యూనిస్టుపార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మొదటి సారి 1983లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత 1985లో గెలుపొందటం ద్వారా తన రాజకీయ యాత్రను కొనసాగించారు. మంత్రిగా అనేక పదవులు నిర్వహించటంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌లను ఎదుర్కొని ఆయన టీడీపీని జిల్లాలో బలమైన శక్తిగా తీర్చిదిద్దేంకు విశేషంగా కృషి చేసారు. సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఏజన్సీ ప్రాంతాల అభివృద్దికి కృషి చేసారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఆయన సత్తుపల్లిని వీడి ఖమ్మంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన ఖమ్మంలో ఓటమి తరువాత కేసీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఎమెల్సీగా పని చేసిన ఆయన 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో శాసన సభ్యుడిగా గెలుపొంది, 2018లో ఓటమి తరువాత అయిదేళ్ళు నిరీక్షించారు. ఆయనకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవటంతో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం శాసన సభ్యుడిగా గెలుపొందారు.

తుమ్మలను వరించిన పదవులు..

తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందిన ప్రతి సారి ఆయనను మంత్రి పదవులు వరించాయి. సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించటం, నిజాయితీపరుడిగా పేరుండటంతో తుమ్మలను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. సత్తుపల్లిలో మొదటి సారి శాసన సభ్యుడిగా గెలుపొందిన తుమ్మల 1985 మే 15 నుంచి చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పనిచేశారు. 1994లో తిరిగి సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుపొంది 1996 అగస్టు 20వ తేదీ నుంచి మధ్య నిషేధ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే ఏడాది డిసెంబర్‌ 5వ తేదీన భారీ మద్యతరహా నీటిపారుదలశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1999 అక్టోబర్‌ 22వ తేదీన తిరిగి మద్య నిషేద శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు 2001 నవంబర్‌ 26వ తేదీనుంచి 2004 వరకు రోడ్లు, భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2014వరకు ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో పని చేసారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి అనంతరం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అదే ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరారు. డిసెంబర్‌ 16వ తేదీన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాఽధ్యతలు చేపట్టి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఖమ్మం జిల్లాలో తొలి మంత్రి అయ్యారు. తరువాత కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పాలేరు ఉప ఎన్నికల్లో 2016లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది, 2018లో ఓటమి పాలయ్యారు. అయిదేళ్లు నిరీక్షణ అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఖమ్మంలో గెలుపొంది గురువారం రోడ్లు భవనాల శాఖా మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసారు.

టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో….

తుమ్మల తన రాజకీయ ప్రయాణంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు, ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, చంద్రబాబు, కేసీఆర్‌ల మంత్రి వర్గాల్లో ఇంతకు ముందు పని చేయగా ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి మంత్రి వర్గంలో పదవి స్వీకరించారు.

మూడో సారి ఆర్‌ అండ్‌ బీ శాఖ

పాలనలో అనుభవం, సమర్థవంతంగా బాధ్యతల నిర్వహణ నేపథ్యంలో ఆయనకు కీలక శాఖలు ఇప్పటి వరకూ దక్కాయి. గతంలో ఆయన ప్రొహిహిషన అండ్‌ ఎక్సైజ్‌ శాఖలు రెండు పర్యాయాలు నిర్వహించగా, 2001-2004 వరకూ, 2014-2018 మధ్య రోడ్లు భవనాల శాఖా మంత్రిగా పని చేసిన ఆయన తిరిగి ప్రస్తుత మంత్రి వర్గంలో మూడో సారి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసారు. 2014-2018 మధ్య కాలంలో ఖమ్మం జిల్లాను అనుసంధానం చేస్తూ అనేక జాతీయ రహదారుల మంజూరుకు కృషి చేసారు. వీటిలో కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.