TS Wines Shops Close: మద్యం ప్రియులకు మరో చేదువార్త. వీకెండ్లు చిల్ అవుదామనుకున్న వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచి 48 గంటలు మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉండడంతో లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇటీవల రెండు రోజులు బంద్..
రాష్ట్రంలో మద్యం షాపులను ఇటీవల రెండు రోజులపాటు బంద్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం 6 గంటల నుంచి.. మే 13 సాయంత్రం 6:00 వరకు వైన్స్ బార్లు మూసివేశారు. జూన్ 4తేదీన లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసేయనున్నారు. అయితే.. ఈ గ్యాప్ మరోసారి లిక్కర్ షాపులకు తాళాలు వేయాలని ఈసీ ఆదేశించింది.
ఉప ఎన్నికల నేపథ్యంలో..
మే 27వ తేదీ సోమవారం ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఆ రోజున కూడా వైన్ షాపులతో పాటు బార్లు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. 27వ తేదీన వైన్ షాపులు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
మూడు జిల్లాల్లోనే..
అయితే.. మే 27న ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మాత్రమే వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.