IT Jobs: ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే ఒక మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనేది విద్యార్థుల కల. రిషర్ట్స్గా జాబ్ కొడితే జీవితం సెట్ అయిపోతుందని భావిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో రాకపోయినా.. చదువు అయిపోగానే కొలువుదీరాలని భావిస్తుంటారు. ఇందుకోసం ఇంజనీరింగ్ పూర్తికాగానే వివిధ కోర్సులు కూడా నేర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం పై దృష్టి సారించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా లేఆఫ్ ప్రకటిస్తున్న వేళ లెవెల్స్.ఎఫ్‌వైఐ అనే ప్లాట్ ఫామ్ ఐటీ ఉద్యోగాలపై కీలక విషయాలను వెల్లడించింది.
ఏఐ తప్పనిసరి..
ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ ఐ) వినియోగం అనివార్యంగా మారింది. అన్ని సెక్టార్లలో కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోయింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ స్కిల్స్ అప్‌డేట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక కోర్స్‌తో సరిపెట్టుకుంటామనే రోజులు పోయాయి. కచ్చితంగా అప్‌డేట్ కావాల్సిందే. ప్రపంచ దిగ్గజ సంస్థలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఏఐ నైపుణ్యం ఉన్న ఇంజనీర్లనే ఎక్కువగా తీసుకుంటున్నాయి.
వేతనాలు ఎక్కువే..
ఒకవైపు ఐటీరంగం సంక్షోభం ఎదుర్కొంటుంది. చాలా కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి.. ఈ భయాల నడుమ టెక్నాలజీ లో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేతనాలు కూడా అధికంగా చెల్లిస్తున్నాయి. సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పోల్చితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన ఉన్న వారికి 50 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయని ‘లెవెల్స్.ఎఫ్‌వైఐ’ తన తాజా నివేదికలో పేర్కొంది. అగ్ర రాజ్యం అమెరికాలో ఏఐ స్కిల్స్ ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వేతనం ఏటా మన కరెన్సీలో రూ.2,49,31,650గా ఉంది. సాధారణ ఐటీ ఉద్యోగులతో పోల్చితే వీరికి సుమారు లక్ష డాలర్లు అధికం.
ఏఐకి డిమాండ్..
రెండేళ్ల క్రితం ఏఐ నిపుణులు, సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మధ్య వేతనంలో వ్యత్యాసం 30 శాతం ఉండేది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వేతన వ్యత్యాసం ఏకంగా 50 శాతానికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఏఐ నిపుణులకు మరింత డిమాండ్ ఉండనుంది. ఉద్యోగాలు కోల్పోకూడదన్నా, మరింత మెరుగైన జీతాలు పొందాలన్నా ఐటీ ఉద్యోగులు కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రావీణ్యం పొందాలి అని నిపుణులు చెబుతున్నారు.