TS Media Academy Chairman: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమిస్తారని మొన్నటిదాకా ఓ పత్రిక ఎడిటర్ పేరు వినిపించింది. ఆయన పనిచేస్తున్న యాజమాన్యం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఆ పత్రిక అధినేత ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయిన తర్వాత ఆ పత్రిక అధిపతికే తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ పత్రికలో పనిచేస్తున్న ఎడిటర్ కు మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఖాయమని సంకేతాలు వినిపించాయి. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఒకసారి గా ఆయన పేరు తారు మారయింది. ఓ సీనియర్ జర్నలిస్ట్ కి ఆ పదవి కట్టబెడుతూ ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.. ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతి పత్రిక కే శ్రీనివాస్ కు మీడియా అకాడమీ చైర్మన్ పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది.. అప్పట్లో జర్నలిస్ట్ సర్కిల్లో కూడా ఇందుకు సంబంధించి చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా శ్రీనివాస్ కు బదులు శ్రీనివాస్ రెడ్డికి మీడియా అకాడమీ చైర్మన్ పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది. గతంలో మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ పనిచేశారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పరిపాలించిన పది సంవత్సరాలూ ఆయనే మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్ గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన విశాలాంధ్ర పత్రికకు ఎడిటర్ గా పని చేశారు. సీనియర్ జర్నలిస్టుగా.. జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాత్రికేయుల సమస్యలపై పోరాటాలు చేశారు.. అయితే అప్పట్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఎందుకని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ ఏర్పడక ముందే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని సంఘంలో పనిచేసిన జర్నలిస్టులు అల్లం నారాయణ అధ్యక్షతన టీయూడబ్ల్యూజే సంఘంగా ఏర్పడ్డారు. ప్రభుత్వ అండదండలు ఉండడంతో టీయూడబ్ల్యూజే శ్రీనివాసరెడ్డి వర్గంపై పై చేయి సాధించిందనే విమర్శలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డికి ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడంతో.. ఆయన యూనియన్ యాక్టివ్ అవుతుందని విశ్రాంత జర్నలిస్టులంటున్నారు. మరోవైపు కే శ్రీనివాస్ కు మీడియా అకాడమీ చైర్మన్ పదవి రాకపోవడం పట్ల రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.