TS Election Results 2023: మొన్నటిదాకా అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసలు లెక్కలోనే లేదు. 2018 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా భారత రాష్ట్ర సమితిలో చేరారు. కొందరైతే మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి నాయకత్వం అప్పగించింది. అయినప్పటికీ జరిగిన వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. చివరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపకుండానే చేతులెత్తేసింది. దీనికి తోడు పార్టీలో సీనియర్లు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయి బీజేపీలో చేరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఇంత అపఖ్యాతిని మూటకట్టుకోవడం ఒకరకంగా క్యాడర్ ను ఇబ్బంది పెట్టింది. కానీ ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
కవితను అరెస్టు చేయకపోవడంతో..
కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజంతో పని చేయడం ప్రారంభించింది. వెతకబోతున్న తీగ కాలికి తగినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దోబూచులాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది. క్షేత్రస్థాయిలో పదేపదే ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు బిజెపి, బీఆర్ఎస్ ఒకటే అనే నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ లోగానే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లతో వరుస సభలు నిర్వహించారు. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీలను తెలంగాణలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రకటించారు. ఖమ్మం వేదికగా తెలంగాణలో అధికరణలోకి వస్తే ఏం చేస్తామో రాహుల్ గాంధీ చేత చెప్పించారు. వికారాబాద్ సభలో ప్రియాంక గాంధీ నోటి ద్వారా దళిత డిక్లరేషన్ ప్రకటించారు. ఇవి మాత్రమే కాకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలలో భారీ ఎత్తున సభలు నిర్వహించారు. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఆ పార్టీ శ్రేణులకు ఒక నమ్మకం ఏర్పడింది.
ప్రజల్లోకి బలంగా ఆరు గ్యారంటీలు
ఇక తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన సోషల్ మీడియాను ఈ ఎన్నికల్లో విపరీతంగా వినియోగించుకుంది. సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో సోషల్ మీడియా అత్యంత శక్తివంతంగా పనిచేసింది. వాస్తవానికి గత మూడు నెలల కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత బలంగా ఉండేది కాదు. ఎప్పుడైతే సునీల్ ఆ బాధ్యతలు స్వీకరించారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శక్తివంతంగా పనిచేయడం ప్రారంభించింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అఫీషియల్ ఫేస్ బుక్ ఎకౌంటుకు కనీసం 20,000 మంది ఫాలోవర్స్ కూడా ఉండేవారు కాదు. అని ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా మూడు లక్షలకు చేరుకుంది. ఇక ప్రభుత్వ విధానాలపై రూపొందించిన ప్రకటనలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదం బాగా వర్క్ అవుట్ అయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో చార్జిషీట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నివేదికలు వెలువరించింది. ఇవి చాలా బలంగా పనిచేశాయి.
ఐక్యత రాగం
సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఉంటుంది. అయితే ఈసారి టికెట్ల కేటాయింపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గొడవలు భారీగానే జరిగాయి. కొందరైతే గాంధీ భవన్ కు తాళం వేశారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. సహజంగానే దీనిని రేవంత్ రెడ్డి అత్యంత తెలివిగా తిప్పికొట్టారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో తన కోటరీని పెంచుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తనకు పూర్తి మద్దతు లభించేలా చేసుకున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు ఆర్థిక సహకారం అందించారు. ఫలితంగా అప్పటివరకు పాతుకుపోయిన సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ అర్థం అయిపోయింది. ఈ సమయంలో తాము వితండవాదానికి దిగితే ఇక ఎప్పుడూ అధికారంలోకి రాబోమని వారికి అర్థమైంది. దీంతో వారంతా రేవంత్ రెడ్డి నాయకత్వానికి జై కొట్టడం ప్రారంభించారు. ఇక ఈ పరిణామం భారత రాష్ట్ర సమితికి కొంత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే గతంలో కొంతమంది కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు అటువంటి పప్పులు ఉడకపోవడంతో భారత రాష్ట్ర సమితి కొంతమేర ఇబ్బంది పడింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత, రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూకుడు తనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కారణాలయ్యాయి. ఏకంగా కేసీఆర్ కు హ్యాట్రిక్ ను దూరం చేశాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి.