Crime : ఇంతకంటే దారుణం ఉంటుందా? అయినవారికి భయపడి.. కుమారుడిని చంపుకున్న తండ్రి

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో రాములపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు భార్య, కుమారుడితో వెళ్ళాడు. సాయంత్రానికి తిరిగి సుల్తానాబాద్ వచ్చేశారు.

Written By: NARESH, Updated On : August 27, 2023 2:12 pm
Follow us on

Crime : భూ వివాదంలో అయిన వారే అంతమొందిస్తామని బెదిరించారు. కుమారుడ్ని సైతం చంపేస్తామని హెచ్చరించారు. అయితే ఇటీవల ఆ బెదిరింపులు పెరిగే సరికి ఆ తండ్రి మనస్థాపానికి గురయ్యాడు. 17 నెలల కుమారుడిని బావిలో తోసి.. తానూ పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో కుమారుడు మృతిచెందగా.. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎలిగేడు మండలం రాములపల్లి లో వెలుగు చూసింది.

కల్వల సంజీవరెడ్డి అనే వ్యక్తికి తిరుపతి రెడ్డి, రత్నాకర్ రెడ్డి అనే కుమారులు ఉన్నారు. భూ పంపకాల్లో భాగంగా కుమారులు ఇద్దరు మధ్య వివాదాలు నెలకొన్నాయి. చాలాసార్లు పంచాయితీలు జరిగినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో రత్నాకర్ రెడ్డి భార్య బంధువులు తిరుపతి రెడ్డిని బెదిరిస్తుండేవారు. నీతో పాటు నీ కుమారుడిని సైతం చంపేస్తామని హెచ్చరించేవారు. దీంతో తిరుపతి రెడ్డి భార్య మానస, 17 నెలల కుమారుడు దేవాన్సును తీసుకుని సుల్తానాబాద్ వెళ్లిపోయాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో రాములపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు భార్య, కుమారుడితో వెళ్ళాడు. సాయంత్రానికి తిరిగి సుల్తానాబాద్ వచ్చేశారు.

అయితే శనివారం తిరుపతి రెడ్డి స్వగ్రామం రాములపల్లి వెళ్లేందుకు బైక్ పై బయలుదేరాడు. ఆ సమయంలో కుమారుడు దేవాన్ష్ నేను వస్తానంటూ మారాం చేశాడు. దీంతో కుమారుడిని తీసుకొని బైక్ పై బయలుదేరాడు. నేరుగా పొలానికి వెళ్లి కుమారుడ్ని బావిలో తోసేశాడు. తాను పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే సమయంలో భార్య మానస.. మామయ్య సంజీవరెడ్డికి ఫోన్ చేసింది. భర్త, కుమారుడి గురించి ఆరా తీసింది. అయితే వారు రాలేదని చెప్పడంతో మానస కంగారు పడింది. దీంతో ఆందోళనకు గురైన సంజీవరెడ్డి అనుమానంతో కుమారుడ్ని వెతుక్కుంటూ పొలానికి వెళ్లాడు. అక్కడ తిరుపతి రెడ్డి అచేతనంగా కనిపించాడు. చిన్నారి దేవాన్ష్ చెప్పులు బావి బయట కనిపించడంతో పోలీసుల సాయంతో బావిలో నీటిని తోడించారు. దీంతో దేవాన్ష్ మృతదేహం బయటపడింది. తిరుపతి రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు రత్నాకర్ రెడ్డి, అతని మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్లే కారణమంటూ తిరుపతి రెడ్డి భార్య మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.