https://oktelugu.com/

Tiger: అటు పులి.. ఇటు చిరుత.. కంటిమీద కునుకు లేక గ్రామస్తుల భయం భయం..

కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇందులో క్రూర మృగాలు కూడా ఉన్నాయి. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 19, 2024 / 02:41 PM IST

    Tiger(3)

    Follow us on

    Tiger: అడవులను నరకడం.. గుట్టలను పెకల దీస్తుండడం.. కొండలను కూల్చేయడం వల్ల క్రూరమృగాలకు ఆవాసం లేకుండా పోతోంది. వన్యప్రాణులకు ఆహారం దొరకడం లేదు. దీంతో వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల మీద పడుతున్నాయి. జంతువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో క్రూర మృగాల తాకిడి పెరిగిపోతోంది. ఇందులో పెద్దపులి, చిరుత, ఎలుగుబంటి లాంటి జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి (పలిమెల అడవి), నిర్మల్ జిల్లాలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.

    చిరుతపులుల సంచారం

    నిర్మల్ జిల్లాలో చిరుతపులుల సంచారం అక్కడ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాధ్ పేట శివారు ప్రాంతంలో ఒక విస్తారమైన కొండ ఉంది. ఈ కొండపై గత కొద్దిరోజులుగా చిరుత పులి తిరుగుతోంది. స్థానికులు మేకలను మేపుతుండగా ఆ చిరుత పులి కనిపించింది. ఆ చిరుతపులితో పాటు దాని పిల్ల కూడా ఉంది. గతంలో చిరుత పులి ఈ ప్రాంతంలో సంచరించింది. ఇప్పుడు మళ్లీ వచ్చింది. అది ఆహార అన్వేషణ కోసం వచ్చిందా? లేక మరో చిరుతపులితో సంభోగం కోసం వచ్చిందా? అనేది తేలాల్సి ఉంది. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. చిరుత పాదముద్రలు చూసి.. దాని గమనాన్ని అంచనా వేస్తున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని.. పశువులను కట్టేసే కొట్టాల వద్ద జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

    పలిమెల అడవిలో పెద్దపులి

    జయశంకర్ జిల్లా పలిమెల మండలంలోని కామన్ పల్లి – ముకునూర్ మధ్య కిష్టాపురంలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రాత్రి పలిమేల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కామన్ పల్లి – ముకునూరు వద్ద తన కారులో వెళ్తుండగా.. ఆ పెద్దపులి రహదారి పక్కన కూర్చొని ఉంది. పులి కనిపించడంతో ఒకసారి అతడు ఆందోళన చెందాడు. కొంత సమయం తర్వాత దానిని జాగ్రత్తగా పరిశీలించాడు. అయితే ఇదే ప్రాంతంలో రెండు సంవత్సరాల క్రితం ఇదే పులి సంచరించింది. సమీప గ్రామంలోని పశువుల కొట్టంపై దాడి చేసింది. ఒక పశువును చంపి తినేసింది. ఇక అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. మళ్లీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయాణికుడు చెప్పిన వివరాలు ఆధారంగా పులి పాదముద్రలను సేకరించిన అధికారులు.. అది వెళ్లిన మార్గాన్ని అంచనా వేస్తున్నారు. ట్రాక్ కెమెరాలలో దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు.