Revanth Reddy: కొద్దిరోజులుగా మీడియా సర్కిళ్ళలో, పొలిటికల్ వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మొత్తానికి బయటపడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ నాలుగు రోజులు. ఇప్పటివరకు ఆయన చాలామంది అధికారులను కలిశారు. దాదాపు అధికారులందరూ ఆయనను కలిశారు. కలుస్తూనే ఉన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ నిర్వహించేందుకు వేదికగా మార్చిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి ని ప్రజలు నేరుగానే కలుస్తున్నారు. తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దానికోసం ప్రత్యేకంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సరే రేవంత్ రెడ్డి ప్రజలకు దగ్గర అయ్యేందుకు దీన్ని ఒక సాధనంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేవిధంగా చేసేవారు.. సరే ఇది ఒక కోణం దీన్ని అలా పక్కన పెడితే.. కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఆ అధికారులు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అటు ముఖ్యమంత్రికి ఇటు కేసిఆర్ కు అత్యంత దగ్గరైన అధికారులుగా ముద్రపడ్డారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో కచ్చితంగా వారిపై బదిలీ వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంది.
ఎవరు ఆ అధికారులు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డిని స్మిత సబర్వాల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ప్రియాంక వర్గీస్ ఇంతవరకు కలవలేదు. అయితే ఆ అధికారులు మొత్తం గత ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షించారు. స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి సెక్రటరీగా పని చేశారు. ఇరిగేషన్ అదనపు సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆమె అదే స్థానంలో కొనసాగుతున్నారు. ప్రియాంక వర్గీస్ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డిగా పని చేశారు. స్మిత సబర్వాల్ తో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను అప్పట్లో పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులను కూడా పరిశీలించారు. జయేశ్ రంజన్ పరిశ్రమలు, ఐటీ శాఖను పర్యవేక్షించారు. ఈ అధికారి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. కేటీఆర్ ఐటి శాఖను తీసుకున్నప్పటినుంచి ప్రభుత్వ గడువు ముగిసే వరకు ఆయన ఆ శాఖనే పర్యవేక్షించారు. ఇక అరవింద్ కుమార్ పురపాలక కార్యదర్శిగా పనిచేశారు. ఈయన కూడా కేటీఆర్ కు అత్యంత దగ్గరైన అధికారి. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు విషయంలో వివరాలు కావాలని అడిగితే రేవంత్ రెడ్డికి అప్పుడు మున్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో అరవింద్ కుమార్ పని తీరు పట్ల రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో ఈ అధికారులను బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే వీరంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. వీరే కాకుండా దేవాదాయ శాఖలో తన సర్వీస్ ఎక్స్టెన్షన్ లో ఉన్న అనిల్ కుమార్, జీఏడీ ప్రోటోకాల్ సెక్రటరీ అరవింద్ సింగ్ కూడా సర్వీస్ ఎక్స్టెన్షన్ లో ఉన్నారు. అయితే వీరందరినీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.