Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? పొత్తులతో ముందుకు వెళ్తుందా? పోటీ నుంచి వైదొలుగుతుందా? అసలు ఆ పార్టీ ఉద్దేశం ఏమిటి? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికలకు కసరత్తు చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీలో మాత్రం మౌనమే కనిపిస్తోంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి ఎటువైపు అడుగులు వేస్తుందన్న సస్పెన్స్ తెలంగాణలో కొనసాగుతోంది.
తెలంగాణలో టిడిపి చుట్టూనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకే అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను అనుసరించే నిర్ణయాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు తరువాత టీటీడీపీ బాధ్యతలను బాలకృష్ణ పర్యవేక్షించారు. ఇకనుంచి తానే చూసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన కూడా అనూహ్యంగా పక్కకు తప్పుకోవడంతో టిడిపి నాయకత్వం వేరే వ్యూహంతో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇటువంటి తరుణంలో టిడిపి సోషల్ మీడియాలో తెలంగాణలో టిడిపి పోటీ నుంచి తప్పుకుంటుందని ఒక వార్త బయటకు వచ్చింది. దానిని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు.
టిడిపి ఓటు బ్యాంకు పై కాంగ్రెస్, బిజెపిలు కన్నేశాయి. అటు అధికార బీఆర్ఎస్ సైతం తమ ప్రయత్నాలను ప్రారంభించింది. చంద్రబాబు అరెస్టు తరువాత రకరకాల ప్రచారాలు జరిగాయి. కేంద్ర పెద్దల సహకారంతోనే జగన్ చంద్రబాబు పై కేసులు నమోదు చేయించగలిగారని టాక్ నడిచింది. అయితే ఈ తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి లోకేష్ ను అమిత్ షా తో సమావేశపరిచారు. అది తెలంగాణలోని టిడిపి సాయం కోసమేనని ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరుతున్నట్టు అప్పటినుంచి టిడిపి యాక్టివిటీస్ తగ్గాయి. అటు చంద్రబాబు అరెస్టుకు బిజెపి ఒక కారణం అన్న ఆగ్రహంతో ఉన్న కమ్మ సామాజిక వర్గం, సెటిలర్స్ అనూహ్యంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే బిజెపి అగ్రనాయకత్వం స్పందించినట్లు సమాచారం. టిడిపి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేడు చంద్రబాబును కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ లో మాట్లాడనున్నారు. అధినేత నిర్ణయం మేరకే తెలంగాణలో టిడిపి పోటీ చేస్తుందా? లేదా? అనే దానిపై ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ పొత్తు ఉన్నా.. బాహటంగా మద్దతు తెలపాలన్నా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.