Hyderabad Metro: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో నగలా మెరుస్తున్న ఆభరణం మెట్రోరైలు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించి ఐదేళ్లు దాటింది. అయితే ప్రారంభించిన నాటి నుంచి మెట్రో సంస్థ నష్టాల ప్రయాణం సాగిస్తోంది. దీంతో దీనిని నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ మెట్రోను వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఎల్‌అండ్‌టీ యాజమాన్యం స్పందించింది. మెట్రోను ఇప్పటల్లో విక్రయించే ఆలోచన లేదని, 2026 తర్వాత విక్రయించాలని అనుకుంటున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రెసిడెంట్ ఆర్.శంకర్ తెలిపారు.
ప్రభుత్వ అనుమతితోనే..
వాస్తవానికి 65 ఏళ్ల వరకు సంస్థను విక్రయించేందుకు ఎల్‌అండ్‌టీకి అనుమతి లేదు. కానీ, నష్టాల సాకుతో మెట్రో అమ్మకానికి అనుమతి ఇవ్వాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. భారీ నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ఈమేరకు ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు.
ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఎఫెక్ట్..
తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో మెట్రోరైల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుషులు మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతోపాటు ఊబర్, ఓలా, రాపిడో వంటి సంస్థలు కారణంగా కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తున్న లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. దీంతో మెట్రోను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గతంలో కూడా ఇలా..
అయితే ఎల్‌అండ్‌టీ గతంలో కూడా ఇలాంటి లీకులు ఇచ్చింది. మెట్రోను అమ్మేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం అనేక సబ్సిడీలు కల్పించడంతో అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మెట్రోలో ఏటా రద్దీ పెరుగుతున్నట్లు నిర్వహణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. అయినా తాజాగా నష్టాల సాకుతో అమ్మేస్తామని లీకులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. మరిన్ని సబ్సిడీల కోసమే మెట్రో అమ్మకం అని ఎల్‌అండ్‌టీ లీకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ లీకుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.