https://oktelugu.com/

Telangana: కాంగ్రెస్ చేస్తోన్న అతిపెద్ద తప్పు ఇదే.. ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిందే..!

ఒక్క ఏడాదిలోనే తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం, మంత్రులు చెబుతున్నారు. ఏడాదిలో ఎన్నో గొప్ప పనులు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 26, 2024 / 04:53 PM IST

    Revanth Reddy 1 year Regime

    Follow us on

    Telangana: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు కావస్తోంది. మరో నెల గడిస్తే ఏడాది పూర్తవుతుంది. ఒక్క ఏడాదిలోనే తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం, మంత్రులు చెబుతున్నారు. ఏడాదిలో ఎన్నో గొప్ప పనులు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాదిలో తాము గొప్పగా పనులు చేశామని, కేసీఆర్ గత పదేళ్లలో చేయని పనులను తాము చేశామని రేవంత్ ఇటీవల బహిరంగ సభల్లోనూ చెబుతూ వస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. ఆ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పదేళ్లుగా తాము ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధి చేశామని, ఇప్పుడు వాటిని పేకమేడల్లా కూల్చేస్తున్నారంటూ గులాబీ నేతలు వాపోతున్నారు. పదేళ్లలో చూడని విధ్వంసం ఏడాదిలోనే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రజల్లో మాత్రం ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. రెండు వర్గాలు కూడా తమ వాదనలను బలంగా రుద్దే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ కాస్త వెనుకబడిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ వర్గాలు అనుకున్నంతగా ముందడుగు వేయలేకపోతున్నారని అంటున్నారు.

    గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే రేవంత్ సర్కార్ ఫ్రీ బస్ జర్నీ ప్రారంభించారు. ఈ పథకం వల్ల పెద్ద ఎత్తున మహిళలకు డబ్బులు మిగులుతున్నాయి. లక్షలాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే.. మహిళలకు ఎంతవరకు మేలు చేశామో కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇక మరో పెద్ద టాస్క్ అయిన రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చింది. రైతులకు చాలా మందికి రుణమాఫీ చేసింది. దాదాపు 18వేల కోట్ల వరకు రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. అయితే.. రుణమాఫీ పైనా ప్రచారం చేసుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైనట్లు ప్రచారాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదన్న విమర్శలకు ఎక్కువగా మైలేజీ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి మంచి పనులే చేశారు. ఎక్కడ కూడా ప్రజలపై భారం మోపే ఒక్క పనిని కూడా చేయలేదు. కానీ.. బీఆర్ఎస్ మాత్రం నిమిషం కరెంటు పోయినా దానికి రేవంత్ రెడ్డినే కారణమంటూ నిందిస్తూనే ఉంది. ఇప్పుడే పాలన మెరుగ్గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మాత్రం కాంగ్రెస్ ఎందుకు తిప్పికొట్టలేకపోతోందా అని అంటున్నారు. నిజానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలాగే ఉండేది. కానీ.. దేనికి కాంగ్రెస్ వెనుకబడి పోతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూముల సేకరణ సైతం కావాలి. సీఎం సొంత నియోజకవర్గంలో భూసేకరణ చేయాలని అనుకుంటే దానిని బీఆర్ఎస్ వివాదస్పదం చేసింది. కానీ.. దానికి ఆ స్థాయిలో కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికైనా రేవంత్ అండ్ టీమ్ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టకపోతే ముందుముందు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.