Thief Attacks DCP: ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. సరిగ్గా కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ నగరంలోని ఒక కానిస్టేబుల్ పై కరుడుగట్టిన నేరస్థుడు కత్తితో పొడిచాడు.. అనేక పర్యాయాలు కత్తితో దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చివరికి ఆ కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అంతకుముందు కూడా కొంతమంది వ్యక్తులు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఏటంగా డీసీపీ మీద దొంగలు దాడులకు పాల్పడడం విశేషం.
Also Read: ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో మిస్ అయిన మహేష్ బాబు సినిమా అదేనా?
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా విడిపోయారు. కొద్దిరోజులుగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు సెల్ ఫోన్ దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వారు డిసిపి చైతన్యకుమార్ మీద దాడి చేశారు. ఆయన గన్ మెన్ మీద కూడా దాడులకు పాల్పడ్డారు. వారిద్దరూ పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ దొంగకు గాయాలైనట్టు తెలుస్తోంది. మరో దొంగ గురించి సమాచారం తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సంచలనం కలిగించింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. వివరాలు సేకరించారు.
ఆ దొంగల వద్ద అధునాతన ఆయుధాలు ఉండడంతో పోలీసుల మీద దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.. ఏకంగా డీసీపీ స్థాయి వ్యక్తి మీద దొంగలు దాడులకు పాల్పడడం సంచలనం కలిగిస్తోంది. నిజామాబాద్ కానిస్టేబుల్ మీద దాడి ఘటనను మర్చిపోకముందే డీసీపీ చైతన్య కుమార్ మీద దొంగలు దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.. ఇటీవల కాలంలో పోలీసుల మీద పెరిగిపోయిన దాడులను గులాబీ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. హోం శాఖను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని.. అలాంటిది ఆయన పర్యవేక్షిస్తున్న శాఖలోనే పోలీసులకు దిక్కు లేకుండా పోయిందని గులాబీ పార్టీ విమర్శిస్తోంది. అయితే ఇటీవల కాలంలో నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ మరణానికి కారణమైన నేరస్థుడిని పోలీసులు అంతం చేశారు. ఆ తర్వాత ఆవివాదం ముగిసిపోయింది. దానిని మర్చిపోకముందే చాదర్ ఘాట్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.