Indiramma Housing Scheme: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కీలకమైనది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ పథకం ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆకర్షితులయ్యారు. రెండవ మాటకు తావు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మహాలక్ష్మి, గృహ జ్యోతి, 500 కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం.. మార్చి 11 న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. భద్రాచలం రాముల వారి కోవెల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికే ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదికి 4.5 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తామని వివరించింది. ఇళ్ళను కూడా మహిళల పేరు మీదనే ఇస్తామని వెల్లడించింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం వెల్లడించింది..
ఒకవేళ సొంత స్థలం లేకుంటే.. లబ్ధిదారులు దారిద్ర్య రేఖ కు దిగువ కుటుంబాలకు చెందిన వారైతే.. వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి.. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వనుంది. కాగా, ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపింది. కేంద్రం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి తెలంగాణకు భారీగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అందువల్లే ప్రతి ఏడాది 4.5 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తామని ప్రకటించింది.