TGPSC: కేంద్ర విభాగాలలో పోస్టులు భర్తీ చేసే యుపిఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఎప్పటికప్పుడు పోస్టులను భర్తీ చేస్తూ ఉంటుంది. దీనికంటూ ఒక వ్యవస్థ ఉంటుంది. ఇందులో రాజకీయ జోక్యం ఉండదు. పైగా ఇది రాజకీయ పునరావాస కేంద్రం అసలు కాదు. అందువల్లే ఈ సంస్థ నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా సాగుతుంటాయి. ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. అందువల్లే యూపీఎస్సీ మీద అందరికీ బలమైన నమ్మకం ఉంటుంది. చెప్పిన తేదీలలోనే పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను వెల్లడిస్తుంది.
యూపీఎస్సీ మాదిరిగానే టీజీపీఎస్సీ పనిచేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆ సంస్థ మీద ఉంది. కానీ ఆ బాధ్యతను పక్కనపెట్టి నిత్యం వివాదాలతోనే టీజీపీఎస్సీ సహవాసం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీలు ఈ సంస్థను రాజకీయ పునరావస కేంద్రంగా వాడుకుంటున్నాయి. తద్వారా పోస్టుల భర్తీ నిత్యం అభాసుపాలవుతూనే ఉంది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించారు. పేపర్ లీక్ వల్ల రెండు సందర్భాల్లోనూ గ్రూప్ వన్ పరీక్ష రద్దయింది. దీంతో నిరుద్యోగులలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయింది. అప్పట్లో నిరుద్యోగుల్లో ఆగ్రహం తగ్గించడానికి స్వయంగా కేటీఆర్ వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఒకరకంగా 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడానికి పేపర్ లీక్ ప్రధాన కారణంగా నిలిచింది.
గులాబీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష అభాసు పాలు కావడంతో.. ఈసారి అలా జరగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పకడ్బందీగా నిర్వహించినప్పటికీ.. ఇందులో కూడా లోపాలు తలెత్తాయి. ఈ లోపాల ఆధారంగా కొంతమంది అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మూల్యాంకనంలో జరిగిన లోపాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ లోపాలను పరిశీలించిన న్యాయస్థానం గ్రూప్ వన్ మూల్యాంకనాన్ని మళ్లీ చేపట్టాలని.. కుదరకపోతే పరీక్షను రద్దు చేయాలని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని సూచించింది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇదే సమయంలో అనేక ప్రశ్నలు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.
“టీజీపీఎస్సీలో పారదర్శకత ఉండదా.. అభ్యర్థుల భవిష్యత్తు ఇలా ఆటలాడుకోవడం ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయం.. ఒకే రకమైన మార్కులు వరుస హాల్ టికెట్లలో రావడం.. ఎంతవరకు సమంజసం.. ఇది యాదృచ్ఛికమా.. లేక పోస్టులను అమ్ముకోవడానికి కుట్ర జరిగిందా.. నోటిఫికేషన్ లో లేకుండా డబుల్, ట్రిపుల్ వ్యాల్యూషన్ చేపట్టడం వెనక కారణమేమిటి? 21,075 అభ్యర్థుల పరీక్ష రాశారని చెబుతుంటే..21,085 మందికి మార్కుల జాబితా ఎలా ఇచ్చారు? ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదా.. లక్షల మంది భవితవ్యాన్ని నిర్ధారించే బోర్డును ఇలా నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం? సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడినప్పటికీ.. కమిషన్ తన తప్పులను ఒప్పుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేదు.. ఇప్పుడు జరిగిన అవకతవకలపై కమిషన్ సభ్యులు ఎందుకు సిద్ధంగా లేరు? బోర్డుపై నమ్మకం కోల్పోయిన యువతకు ఎంతవరకు హామీ ఇవ్వగలరు” అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు..