Jagan: ఇది అనేక సందర్భాల్లో వైసిపి అధినేతకు ఎదురైన ప్రశ్నే.. కాకపోతే ఈసారి మాత్రం సమాధానం స్పష్టంగా చెప్పారు. తమకు 11 సీట్లు వచ్చినప్పటికీ శాసనసభలో ప్రతిపక్ష స్థానం కల్పించాలని స్పీకర్ ను కోరారు. “సభలో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారానికి వస్తే.. అలాంటప్పుడు నాలుగో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా.. ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా స్పీకర్ అడ్డు తగులుతున్నారు. దానికి ఒప్పుకోవడం లేదు. అందువల్లే తాము అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. స్పీకర్ కనుక ప్రతిపక్ష హోదా ఇస్తే కచ్చితంగా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతామని” జగన్ స్పష్టం చేశారు.
జగన్ విలేకరుల సమావేశంలో ఈ సమాధానం చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో సంచలనం నమోదయింది. ఇన్నాళ్లపాటు శాసనసభలోకి అడుగు పెడతాడా? లేదా? అనే విషయంపై రకరకాల చర్చలు జరిగాయి. జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడంతో టిడిపి నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు చేశారు. వాటికి కౌంటర్ ఇవ్వడంలో వైసిపి నాయకులు విఫలమయ్యారు. ఇప్పుడు స్వయంగా తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలోకి అడుగు పెడతామని జగన్ స్పష్టం చేయడంతో.. ఒక్కసారిగా బంతి కూటమికోర్టులోకి వెళ్ళింది. దీనిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారా.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తారా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
మాట్లాడే అవకాశం ఉంటుందా
ప్రస్తుతం ఏపీ శాసనసభలో కూటమి ప్రభుత్వానికి 164 సభ్యుల బలం ఉంది. జగన్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడా.. ఎప్పుడు అతడిని కడిగిపారేద్దామా అన్నట్టుగా కూటమి నేతలు ఉన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు వైసిపి నేతలు అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంకా కొంతమంది నేతలు రాయడానికి వీలు లేని భాషలో మాట్లాడారు. ఈ పరిణామాలు కూటమినేతలలో తీవ్ర కలవరాన్ని ఇప్పటికీ కలిగిస్తున్నాయి. వీటికి బదులు తీర్చుకోవాలని కూటమి నేతలు పట్టుదలతో ఉన్నారు. కూటమినేతల రివెంజ్ తీరాలంటే జగన్ కచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అది జరగాలంటే స్పీకర్ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.