Kishan Reddy- Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ రేసులో అధికార బిఆర్ఎస్ ముందు వరుసలో ఉండగా.. తర్వాత స్థానంలోకి కాంగ్రెస్ తీసుకొచ్చింది. తాజాగా బీజేపీ కూడా రేసుకు సై అంటుంది. ఈ క్రమంలో 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది కమలం పార్టీ. రెండో జాబితా ప్రకారంగా ముందే జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి పొత్తు ప్రతిపాదన చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు పొత్తుకరారు కావడంతో బిజెపి ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
సడెన్ గా తెరపైకి పవన్..
వైసిపి ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పనిచేస్తున్నారు. అక్కడ టిడిపి బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తెరపైకి పవన్ కళ్యాణ్ ను తీసుకురావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కావాలనే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల తెరపైకి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. ఒక దశలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి అన్నట్లుగా పరిస్థితిని ఏర్పడింది. సడన్ గా ఆయనను తప్పించడంతో పార్టీ అంతే వేగంగా చతిగలపడుతోంది. పార్టీలో దూకుడుగా వ్యవహరించే నాయకుడు సైలెంట్ కావడంతో పార్టీపై ఆశలు పెట్టుకున్న క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది.
బండికి చెక్ పెట్టేందుకైనా..
రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించిన బండి సంజయ్ కి బిజెపి అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించింది. చత్తీస్గడ్ స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసింది. తెలంగాణలోనూ ఆయనకు అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో అధ్యక్ష పదవి లేకపోయినా బండి సంజయ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి చెక్ పెట్టేందుకు కిషన్ రెడ్డి పావులు కదులుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలవేళ ఆయన స్థానాన్ని పవన్ కళ్యాణ్ తో భర్తీ చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా తెలంగాణ బిజెపిలో మరో మారు అంతర్గత ఆధిపత్య పోరు మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఇలాంటి పరిస్థితి పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.