Kasani Gnaneshwar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగులు కూడా జోరందుకున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో పెద్ద లీడర్ కారెక్కేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
ముదిరాజ్‌ల ఓట్ల కోసమేనా..
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీసీనేత. తెలంగాణలో అత్యధిక మంది ఓటర్లు ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముదిరాజ్ ఓట్ల కోసం కాసానికి గాలం వేసినట్లు తెలుస్తోంది. అధికార బీఆర్‌ఎస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సమాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ముదిరాజ్‌లను బీజేపీ వైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఇటీవలే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా లక్షలాది మంది ఈ సభకు హాజరయ్యారు. మరోవైపు గజ్వేల్‌లో ముదిరాజ్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ తరుణంలో ముదిరాజ్ ఓటర్లు బీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
టీడీపీలో అసంతృప్తి..
టీడీపీకి తెలంగాణలో మనుగడే కష్టమవుతున్న రోజుల్లో కాసాని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి నడిపిస్తున్నారు. కాగా.. ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ బరిలో దిగుతుందని.. అందుకు 89 మంది అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారని పలు సందర్భాల్లో కాసాని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడు జైలులో ఉండటంతో ఆయన నుంచి ఎన్నికల విషయమై ఎలాంటి సంకేతాలు రాలేదు. చంద్రాబాబు నుంచి ఆదేశాలు రాగానే.. అభ్యర్థుల లిస్టుతోపాటు మేనిఫెస్టో కూడా విడుదల చేసి ప్రచారంలోకి దిగాలని కాసాని రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలో టీడీపీ పోటీ చేయటం లేదని నారా లోకేష్ పేరుతో ఓ లెటర్ విడుదల కావటం చర్చనీయాశంగా మారింది. దీంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన కాసాని.. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా భావించిన బీఆర్‌ఎస్ కాసానికి గాలం వేసినట్లు తెలుస్తోంది.
కాసానిని కారెక్కించుకుని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే.. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతవరకైనా తగ్గించుకోవచ్చని, అదే సమయంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు కూడా కారుకే పడే అవకాశముంటుందని బీఆర్‌ఎస్ పెద్ద స్కెచ్ వేసిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే..!