Drunk and drive cases : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ సంబురాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 31(మంగళవారం) సాయంత్రం నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఎంజాయ్ చేశారు. మందు, చిందుతో పాత ఏడాదికి వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. హైదరాబాద్‌లో అయితే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, రిసార్టులలో వేడుకలు జోరుగా సాగాయి. ఇళ్లలో కూడా ఘనంగా సంబురాలు చేసుకున్నారు. అపార్టుమెంట్లలో వేడుకలు సాగాయి. డీజే పాటలకు చిన్న పెద్ద అంతా స్టెప్పులేశారు. నగరంలో మందుబాబులు మద్యం తాగి రోడ్డుపైకి రావొద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత వేడుకలు ముగించాలని ఆదేశించారు. అయినా హైదరాబాద్‌వాసులు వాటిని పట్టించుకోలేదు. చాలా మంది మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుపడ్డారు.
జాగ్రత్త అని చెప్పినా…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు. అయినా మందుబాబులు మాత్రం మారలేదు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న నిర్వహించిన తనిఖీల్లో 1,184 మంది పట్టుపడ్డారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు అంటేనే ఇంటివద్ద జరుపుకోవాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. ఫ్రీ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా మందుబాబులు వాటిని పట్టించుకో లేదు.
బ్రీత్ అనలైజర్లు పగిలేలా..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా ఈస్ట్ జోన్‌లో బ్రీత్ అనలైజర్లు పగిలేలా మందు తాగారు. ఈస్ట్ జోన్‌లో 236 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో 192 కేసులు, వెస్ట్, సౌత్ జోన్‌లో 179 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నార్త్ జోన్‌లో 177, హైదరాబాద్ సెంట్రజ్ జోన్‌లో 102 కేసులు నమోదయ్యాయి.
డ్రగ్స్ టెస్టులో ఒకరికి పాజిటివ్
ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిర్వభించిన డ్రగ్ అండ్ డ్రైవ్‌లో ఒకరు పట్టుపడ్డారు. జూబ్లీ చెక్‌పోస్టు వద్ద నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి పట్టుపడ్డాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.