AP Cabinet meeting : ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలకు హామీ ఇచ్చింది. ఏడు నెలల పాలన పూర్తి కావడం
.. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడంతో అమలు చేయడానికి డిసైడ్ అయ్యింది. ఏపీ మంత్రి వర్గ సమావేశంలో సంక్షేమ పథకాలకు సంబంధించి చర్చించనున్నారు. నిర్ణయాలు తీసుకొనున్నారు. ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టతనివ్వనున్నారు. ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు, పిఆర్సి కమిషన్ నియామకం వంటి వాటిపై మంత్రివర్గంలో చర్చిస్తారు. తరువాత నిర్ణయాలు ప్రకటిస్తారు. ప్రధానంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉద్యోగుల అంశానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.
* వైసిపి హయాంలో వైయస్సార్ రైతు భరోసా అమలు చేసేవారు. ప్రతి ఏటా సాగుకు 7500 రూపాయలను అందించేవారు. కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయల మొత్తాన్ని కలుపుకొని 13,500 అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే సాగు పెట్టుబడి కింద ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి అన్నదాత సుఖీభవ పేరు పెట్టారు.ఆ హామీ అమలు చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బడ్జెట్లో కొంత మొత్తాన్ని కూడా కేటాయించారు. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
* వైసిపి హయాంలో అమ్మ ఒడి పేరిట పథకాన్ని అమలు చేశారు. ఇంట్లో చదువుకునే ఒక విద్యార్థికి 15000 రూపాయలు సాయం అందించేవారు. అందులో 1000 రూపాయల నుంచి 2000 వరకు పాఠశాలల నిర్వహణ కంటూ కోత విధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు అందిస్తామని.. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తింప చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని సైతం అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
* వైసిపి హయాంలో ఉద్యోగులకు డిఏ బకాయిలు పెండింగ్లో ఉండిపోయాయి. ఒక డిఏ విడుదలకు సంబంధించి రేపు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పిఆర్సి కమిషన్ నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం నియమించిన పి ఆర్ సి కమిషన్.. కూటమి అధికారంలో రాగానే రాజీనామా చేసింది. దీంతో కొత్త పిఆర్సి నియామకంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.