Telangana Internet: సాంకేతికతలో తెలంగాణ దూసుకుపోతోంది. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. దేశంతోపాటు విదేశాల్లో తెలుగు ఐటీ నిపుణులు కీలక పోస్టుల్లో ఉన్నారు. ఇక కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యాక ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. దీంతో రిలయన్స్, భారతి టెలీ సంస్థలు దేశ వ్యాప్తంగా ఇంటర్నెట సేవలను అందరికీ అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ధరలను భారీగా తగ్గించాయి. అయితే ఐదేళ్లు పోటీపడి చౌకగా ఇంటర్నెట్ అందించిన సంస్థలు.. ఇప్పుడు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలు ఫైబర్ నెట్‌పై దృష్టి పెట్టాయి. 5జీ సేవలన అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్నెట్ విప్లవం తీసుకువస్తోంది. తక్కువ ధరకే ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తోంది. రూ.300లకే కనెక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంటింటికీ ఇంటర్నెట్..
రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ఇది వైఫైలాంటి కనెక్షన్. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తోపాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలు గ్రామీణులకు అందుబాటులోకి వస్తాయి. మొదటి విడతలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2,096 గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ఆదివారం(డిసెంబర్ 8న) ప్రారంభించనున్నారు. క్రమంగా రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది.
భారత్ నెట్‌లో భాగంగా..
దేశంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం భారత్ నెట్ పేరుతో పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాస్ట్రానికి రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతీ ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫైబర్‌నెట్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ ఫైబర్ తీసుకుంది.
ఇక టీవే.. కంప్యూటర్..
ప్రతీ ఇంటికి రూ.300లకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంటర్నట్ కనెక్షన్‌తో ప్రతీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తారు. ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపు కూడా చేయవచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కనెక్షన్ ఇస్తారు. విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. కనెక్షన్ తీసుకునేవారితో సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతీ గ్రామంలోని జంక్షన్లు, ఇతర చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వీటిని ఫైబర్‌నెట్‌తో అనుసంధానం చేస్తారు.