Telangana Budget 2024: రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శాసనసభలో 2024_25 సంవత్సరానికి గానూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగానే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి శనివారం ఉదయం 9 గంటలకు సమావేశం అయింది. బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక శనివారం ఉదయం రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ కు అమోద ముద్ర వేసింది.. ఇక భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అటు శాసనసభ, శాసనమండలి 12వ తేదీకి వాయిదా పడతాయి.
12వ తేదీన బడ్జెట్ పై చర్చ చేపట్టి అదే రోజు సభ్యుల సలహాలు, సూచనలను ప్రభుత్వం తీసుకుంటుంది. వారు వ్యక్తం చేసే సందేహాలకు సమాధానం ఇస్తుంది.. అయితే ఈ స్వల్పకాలానికి ప్రభుత్వం ఏ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవ రెవెన్యూ రాబడులు ఏ స్థాయిలో ఉంటాయి? కేంద్ర పన్నుల్లో ఏ స్థాయిలో వాటా వస్తుంది? గ్రాంట్లు, కాంట్రి బ్యూషన్ల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై చర్చ జరుగుతున్నది. వీటి ఆధారంగానే బడ్జెట్ కు రూపకల్పన చేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రకటించారు. ఆర్థిక శాఖ అధికారులకు కూడా ఇందుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కూడా ఆచితూచి బడ్జెట్ రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరే రాబడుల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని ప్రచారం జరుగుతున్నది. అయితే వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కు రూపం ఇచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో భారత రాష్ట్ర సమితి బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు వాస్తవ లెక్కలకు దూరంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. “ప్రభుత్వం పెడుతున్న ఖర్చుకు.. వస్తున్న రాబడికి పొంతన లేకుండా ఉంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలోనూ రాష్ట్రం ఎక్కువగా వస్తున్నట్లు చూపించింది.. కానీ అవి వచ్చేది తక్కువ” అని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే ఈ బడ్జెట్లో ఈ ఆరు పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇంకా కొన్ని హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాటి అమలు కోసం ఈ బడ్జెట్లో చాలా వరకు కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవ బడ్జెట్ రూపొందించుకుంటూనే.. కేటాయింపులు ఉన్నాయని.. నేల విడిచి సాము చేయకుండా బడ్జెట్ రూపొందించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.