Telugu Media : మీడియా అనేది దిగజారింది. వ్యాపారవేత్తలు మీడియాలోకి రావడంతో తన ప్రాచుర్యాన్ని కోల్పోయింది. గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడానికి.. నచ్చని వాళ్ళ మీద బురద చల్లడానికి ఉపయోగపడుతోంది. వాస్తవాల స్థానంలో అభూత కల్పనలను.. సమస్యల స్థానంలో పక్రీకరణలను ప్రచురిస్తోంది. ప్రసారం చేస్తోంది. అయితే తెలుగు నాట ఇప్పుడు మీడియా వ్యవహారం మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. మీడియా అధినేతలు.. వారి వారసులు అడ్డగోలు దందాలకు.. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ మీడియాను అయితే అడ్డం పెట్టుకొని వాళ్లు అవన్నీ చేస్తున్నారో.. ఆ వ్యవహారాలే మీడియాలో ప్రముఖంగా రావడం పడిపోయిన విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది. పొలిటికల్ పార్టీల మౌత్ పీస్ లాగా మీడియా మారిపోవడంతో.. స్వార్థ ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలు పాత్రికేయంగా రూపాంతరం చెందడం అత్యంత విషాదం.
ఎవరా మీడియా అధినేత కుమారుడు?
ఈరోజు సాక్షి పత్రిక రెండు రాష్ట్రాల ఎడిషన్లలో ” మాదక ద్రవ్యాల దందాలో ఓ టీవీ ఛానల్ అధినేత కుమారుడు” అనే శీర్షికన బాటమ్ బ్యానర్ ప్రచురితమైంది. సహజంగానే ఈ వార్త ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు. అంటే ఆ టీవీ ఛానల్ అధినేత టిడిపి కాంపౌండ్ కు చెందిన వ్యక్తి అని స్పష్టమవుతోంది. అయితే ఈ కథనంలో సాక్షి కాస్త హుందాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రయత్నానికి ఒప్పుకోవాల్సిందే. ఆ ప్రముఖ మీడియా సంస్థ అధినేత కుమారుడు నిత్యం మాదకద్రవ్యాల వినియోగదారులతో టచ్ లో ఉంటున్నాడని.. నార్కోటిక్ అధికారులు అతనిపై నిఘా పెట్టారని.. సస్పెక్ట్ కేసుగా నమోదు చేశారని.. అతడికి వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. సాక్షి సంచలన వార్తను ప్రచురించింది. అయితే ఆ మీడియా అధినేత కుమారుడు ఎవరనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. సరే ఇలాంటి హై ప్రొఫైల్ కేసులలో విషయాలు బయటపడవు. ఎందుకంటే ప్రత్యర్థి మీడియా సంస్థ అధినేత కుమారుడైనప్పటికీ సాక్షి కథనం వరకే ప్రచురించింది. ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ లెక్కన ఆ ఛానల్ అధినేత కుమారుడు చేసిన దందా భారీదే అనుకోవాలి. ” మాదక ద్రవ్యాల పై ఉక్కు పాదం మోపుతాను.. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోనని” తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఈ ఛానల్ అధినేత కుమారుడి పై చర్యలు తీసుకుంటారా.. లేకుంటే తాను చేసిన వ్యాఖ్యలు మొత్తం కేవలం భీషణ ప్రతిజ్ఞలు మాత్రమే అని చాటి చెప్తారా.. అనేది చూడాల్సి ఉంది.
ఆరోపణలు ఇదే తొలిసారి కాదు
మీడియా అధినేతలపై, వారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఇవే తొలిసారి కాదు.. చివరికి టీవీలలో డిబేట్లు రన్ చేసే ప్రజంటర్లు కూడా దందాలకు పాల్పడుతున్నారట. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ లో పనిచేసే ఓ ప్రజెంటర్.. ఏకంగా ఆ ఛానల్ అధినేత కుమార్తెనే లైన్ లో పెట్టాడట. అతడికి అంతకుముందే పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఛానల్ అధినేత కుమార్తెకు ఆ విషయం తెలుసు. పైగా ఆమెకు కూడా వివాహమైంది. అయినప్పటికీ ఆ న్యూస్ ప్రజెంటర్ తో చట్టా పట్టాలు వేసుకొని తిరిగింది. చివరికి ఆ విషయం చానల్ అధినేతకు తెలియడంతో ఆ ప్రజెంటర్ ను దూరం పెట్టాడు. మొత్తానికి పంచాయతీ సెటిల్ కావడంతో మళ్ళీ ఛానల్లోకి అడుగు పెట్టాడు.
అప్పట్లో పేరున్న ఛానల్ అమ్మకపు వ్యవహారాలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చానల్లో భారీగా రాబడి పెరగడంతో.. దానిని మరో ఛానల్ లోకి మళ్లించడానికి చేసిన ప్రయత్నం వార్తల్లో నిలిచింది. ఇవి మాత్రమే కాదు టీవీల టిఆర్పిల ట్యాంపరింగ్ కుట్రలు.. అనుమతులు.. ఇంకా రకరకాల వ్యవహారాలు మీడియాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి. అయినా రాజకీయ పార్టీల అండదండలు ఉన్నంతవరకు.. రాజకీయ నాయకుల ప్రోత్సాహం లభిస్తున్నంతవరకు మీడియా ఆధిపతులకు ఏమీ కాదు. కొద్దిరోజులు తమకు వ్యతిరేకమైన మీడియాలో వార్తాంశాలుగా.. క్లిక్ బైట్ న్యూస్ లుగా మాత్రమే ఇవి ప్రచారంలో ఉంటాయి. ఆ తర్వాత ఆ మీడియా అధిపతులు పెద్దమనుషులు లాగా చలామణి అవుతూనే ఉంటారు.