KTR : ‘దేశానికి రాజు అయినప్పటికీ.. పుట్టిన ఊరిని మరిచిపోవద్దు’ అని అంటుంటారు. పుట్టిన ఊరు.. కన్న తల్లిలాంటిది అని కూడా చెబుతుంటారు. అందుకే చాలా మంది ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తమ ఊరిని మాత్రం మరిచిపోరు. రాజకీయంగా దేశ స్థాయికి ఎదిగినా.. ఉద్యోగంలో ఉన్నత హోదాకు చేరినా.. ఢిల్లీలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా.. పుట్టిన ఊరిపై మమకారం చాటుతూనే ఉంటారు. పుట్టిన ఊరిపై మమతను చాటుతూ చాలా సినిమాలు సైతం వచ్చాయి. ఊరు.. అక్కడి ప్రేమాభిమానాలు.. అక్కడి వాతావరణం.. చిన్ననాటి మిత్రులను ఎవరు మాత్రం మరిచిపోతారు.
కేటీఆర్.. రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన ఆ స్థాయికి వచ్చారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే.. ఆయనను అంత ఎత్తుకు చేర్చింది కూడా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలే అని ఇప్పటికీ స్వయానా కేటీఆరే చెబుతుంటారు. తనకు తన తల్లి జన్మనిస్తే.. సిరిసిల్ల మాత్రం రాజకీయ జన్మనిచ్చిందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సిరిసిల్ల ప్రజలకు తాను ఏం చేసినా తక్కువే అని.. వారు చూపిన ప్రేమపై రుణం తీర్చుకోలేదని చెప్పేవారు.
కేటీఆర్ అమ్మమ్మ తాత వాళ్ల గ్రామం కొదురుపాక. కేటీఆర్ సైతం అక్కడే జన్మించాడు. అందుకే.. ఆయనకు ఆ గ్రామం అంటే కాస్త మక్కువ ఎక్కువే. దాంతో నిత్యం కేటీఆర్ అక్కడికి వెళ్తుంటాడు. ఓ సారి కొదురుపాక గ్రామంలో కేటీఆర్ పర్యటించారు. అమ్మమ్మ వాళ్ల ఊరు కావడంతో అక్కడి జ్ఞాపకాలను ఒకసారి గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడి స్కూల్ దుస్థితిని టీచర్లు, పిల్లలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత పదేళ్లు ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ.. మంత్రిగా కాకుండా అమ్మమ్మ-తాతయ్యల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతోనే అక్కడ పాఠశాల నిర్మించాలనుకున్నాడు. భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అన్ని హంగులతో నిర్మించాలని సంకల్పించారు. దాంతో వెంటనే ఆ పనిని ప్రారంభించారు. రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ఇప్పటికి పూర్తయ్యాయి.
ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆ పాఠశాల భవనం ప్రారంభానికి సిద్ధమైంది. స్వయంగా కేటీఆరే ఆ భవాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం రెండు ఫ్లోర్లలో 18 తరగతి గదులను నిర్మించారు. వంట గదితోపాటు డైనింగ్ హాల్, కంప్యూటర్ గదులు, ప్రహరీ నిర్మించారు. ఈ భవనం నిర్మాణానికి సుమారు రెండు కోట్ల వరకూ ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ సొంత నిధులతో నిర్మించడంతో స్మారకార్థం పేర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతో కేటీఆర్ ఆ పాఠశాలకు వారిద్దరి పేర్లు పెడుతున్నట్లుగా సమాచారం.
అయితే.. కేటీఆర్ తన సొంత ఖర్చులతో భవనాన్ని నిర్మించి ఇవ్వడంతో.. ఇప్పుడు ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. మరోవైపు.. మరో టాక్ కూడా వినిపిస్తోంది. పదేళ్లు అధికారంలో ఉండి అమ్మమ్మ ఊరిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇన్నాళ్లకు తన అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం ఓ మంచి పనిచేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇంకా గ్రామంలో సమస్యలు ఉన్నాయని… వాటిని కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.