Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ హెచ్చరిక.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి

మొన్నటి వరకు భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుట పడుతోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోమారు హెచ్చరిక జారీ చేసింది.

Written By: Raj Shekar, Updated On : September 26, 2024 12:25 pm

Rain Alert

Follow us on

Rain Alert : మొన్నటి వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోమారు వరణుడు రెండు రాష్ట్రాలను పగబట్టాడు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలహీన పడినప్పటికీ ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. అల్పపీడన ప్రభావం రెండు రోజులు ఉంటుందని పేర్కొంది. తెలంగాణతోపాటు ఏపీలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలకు చెందిన మత్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..
తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలుచోట్ల బుధవారం(సెప్టెంబర్‌ 25) రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం, శుక్రవారం తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక గురువారం రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం. సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

ఏపీ అంతటా వర్షాలు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోగావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ప్రభుత్వాలు అప్రమత్తం..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. రెండ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ప్రస్తుతం నిండుగా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తే వరదలు భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించాయి. వర్షాల తీవ్రత ఆధారంగా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని సూచించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించాయి.