Shakeel Son Accident: గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో అంబేద్కర్ ప్రజా భవన్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. అప్రమాదంలో డివైడర్ ధ్వంసం అయింది. దానికి కారకుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు. ఆ ప్రమాదానికి కారణం అతడే అని.. సిసి ఫుటేజీ ల్లో కూడా రికార్డయింది. కానీ అప్పటిదాకా గులాబీ భజన చేసిన పోలీసు అధికారులు.. షకీల్ కుమార్ రెడ్డి పై ఔదార్యం చూపించడం మొదలుపెట్టారు. ఏకంగా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అతనిని తప్పించారు. అతని స్థానంలో అతడి డ్రైవర్ ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు. పోలీసులు నాటకాలు ఆడినంతమాత్రాన సిసి ఫుటేజ్ అబద్ధం చెప్పదు కదా.. ఇంకేముంది అసలు విషయం బయటికి వచ్చింది. అతడిని కాపాడిన 15 మంది పోలీసులు కటకటలా పాలయ్యారు. చివరికి ఆ మాజీ ఎమ్మెల్యే కొడుకు కూడా జైలు పాలయ్యాడు. ఇది ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి చాలానే ఉన్నాయి..
నాలుగో సింహంగా, చట్టానికి, ధర్మానికి, న్యాయానికి రక్షణగా నిలబడే వారిగా ఈ సమాజం పోలీసులకు విపరీతమైన గౌరవం ఇస్తుంది. ఖాకీ డ్రెస్ ను అపురూపంగా చూస్తుంది. కానీ కొంతమంది అధికారులు అధికార పార్టీ భజనకు అలవాటు పడి తాము వేసుకున్నది ఖాకీ డ్రెస్ అనే ఇంగితాన్ని కూడా మర్చిపోయారు. తమ లాభాల కోసం, రాజకీయ నాయకుల సొంత పనుల కోసం అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారు. గత భారత రాష్ట్ర సమితి పాలనలో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో ఇప్పటికే నలుగురు కీలక పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. పదుల సంఖ్యలో కిందిస్థాయి పోలీస్ అధికారులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో వందల మంది పోలీసులు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసు ను తీవ్రంగా పరిగణిస్తుండడంతో ఈ వ్యవహారం మరింత దూరం వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
నాడు పోలీసులను తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న రాజకీయ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. జైలుకు వెళ్లిన వారిని కనీసం పరామర్శించను కూడా పరామర్శించడం లేదు. వారి కుటుంబ సభ్యులకు అండగా కూడా ఉండడం లేదు. విలువైన సర్వీస్ ఉండి.. ఎంతో మన్ననలు పొందాల్సిన పోలీసు అధికారులు చివరికి ఇలా నేరగాళ్లు ఉండే జైలుకు వెళ్లడం.. చాలామంది పోలీసులకు ఒక గుణపాఠం.
అందుకే ఐదేళ్ల అధికారంలో ఉండే నాయకులకు గులాం గిరి చేస్తే పోలీసులు తమ పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనేది మారుతూ ఉంటుంది.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా. కానీ అదే సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాల్సిన అధికారులు పార్టీలకు, నాయకులకు భజన చేస్తే జైళ్ళకు వెళ్లాల్సి వస్తుంది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక తెలంగాణ సంగతి పక్కన పెడితే.. ఏపీలో వైసీపీకి అనుకూలంగా పనిచేశామని.. ఇప్పటికే 19 మంది అధికారులు బహిరంగంగా అంగీకరించినట్టుగా ఒక లేఖను ఎన్నికల సంఘానికి రాశారు. ఆ లేఖలో సంతకాలు చేసిన ప్రతి ఒక్కరు చేసిన పనికిమాలిన పనులు.. విధించిన నిర్బంధాలు.. కొంతమందికి కొమ్ముకాసిన విధానం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇక ప్రైవేట్ సెటిల్మెంట్లకయితే లెక్కేలేదన్నట్టుగా తెలుస్తోంది. ఇవే సరిపోదన్నట్టుగా కొన్ని రకాల జీవోలను కొంతమంది అధికారులు దాచి పెట్టారని ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం మారితే విచారణ కూడా అవసరం లేనంతగా ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలను పక్కన పెడితే.. ఎంత మంది అధికారులు బలైపోతారోనేది అంతు పట్టకుండా ఉందని రిటైర్డ్ అధికారులు అంటున్నారు. ” కొంతమంది అధికారులు పోస్టింగ్ ల కోసం అడ్డదారులు తొక్కారు. ఇప్పుడు వారు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే పునరావృతమవుతాయని” వారు అంటున్నారు.