https://oktelugu.com/

Sridhar Babu: ఈ కుహానా మీడియా.. ఆడవాళ్ళ గొప్పతనాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది?

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మంథని అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పుట్ట మధుపై ఘన విజయం సాధించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 17, 2023 / 01:00 PM IST

    Sridhar Babu

    Follow us on

    Sridhar Babu: లింగ వివక్ష అనేది నీచాతి నీచం. ఈ భూమి మీద ఒక మగవాడికి ఎన్ని హక్కులు ఉంటాయో.. ఆడవాళ్లకు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అంతేతప్ప మగవాళ్ళు ఎక్కువ కాదు.. ఆడవాళ్లు తక్కువ కాదు.. కాకపోతే మన సమాజం మొదటి నుంచి ఆడవాళ్లను వంటింటి కుందేలు చేసింది. ఆడవాళ్ళకు సంబంధించి ఒక స్పష్టమైన గీతలు గీసింది. అయితే కాల క్రమంలో సమూల మార్పులు వస్తున్నాయి. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. విదేశాలకు కూడా వెళ్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు. అత్యంత కఠినమైన రక్షణ రంగంలోనూ కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే మహిళలు సాధిస్తున్న విజయాలను మీడియా పెద్దగా పట్టించుకోవడంలేదు. వాళ్ల విజయాన్ని విజయంగా చూడటం లేదు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటే.. ఆ ఆడదాని గురించి రాయని మీడియా.. అదే ఆడది విజయం సాధిస్తే దాని వెనుక ఉన్న మగవాడి గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.

    ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మంథని అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పుట్ట మధుపై ఘన విజయం సాధించారు. సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఐటీ, పరిశ్రమల శాఖను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఆయన ఆ శాఖ పై పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన అధికారులను పక్కకు తప్పించి.. ఇతర అధికారులను నియమించుకున్నారు. అయితే ఇదే సమయంలో పలు కీలక శాఖలకు ప్రభుత్వం అధికారులను నియమించింది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ కూడా ఒకటి. ఈ వైద్యారోగ్య శాఖకు కమిషనర్ గా శైలజ రామయ్యర్ ను ప్రభుత్వం నియమించింది. వాస్తవంగా శైలజ రామయ్యర్ క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు కమిషనర్ గా మొన్నటిదాకా వ్యవహరించారు.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమె ట్రాక్ రికార్డు గుర్తించి ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ను కేటాయించింది. అయితే ఇక్కడ శైలజ సాధించిన విజయాన్ని మీడియా ఒక వార్తలాగా చూస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు.. ఇక్కడే మీడియా తన పక్షపాతాన్ని చూపించింది.

    దుద్దిల్ల శ్రీధర్ బాబు, శైలజ రామయ్యర్ దంపతులు.. ఇద్దరిదీ ప్రేమ వివాహం. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు శైలజ పలు కీలక విభాగాల్లో అధికారిగా పని చేశారు. ముక్కుసూటి ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈమెది 19 97 ఐఏఎస్ బ్యాచ్.. తన భర్త రాజకీయాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. శ్రీధర్ బాబు కూడా తన రాజకీయాలకు ఆమెను వాడుకోలేదు. ప్రొఫెషనల్ గా ఎవరి దారి వారిదే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆమె పనితీరు గుర్తించి వైద్యానికి శాఖను కేటాయించింది.. ఇందులో శ్రీధర్ బాబు ప్రమేయం ఉంటే ఉండవచ్చు గాక.. ఆ లెక్కన చూసుకుంటే స్మితా సబర్వాల్ మాటేమిటి. జయేష్ రంజన్ కథ ఏమిటి.. వీటన్నిటినీ విస్మరించి మీడియా శ్రీధర్ బాబు సతీమణికి వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు అని రాసింది. అంటే మీడియా దృష్టిలో శ్రీధర్ బాబు మాత్రమే గొప్ప హోదా ఉన్నవాడ? శైలజ పేరు కీర్తి లేని మహిళనా? ఆమె ఒక ఐఏఎస్ అధికారి అని.. సీనియార్టీ ప్రకారమే ఆమెకు వైద్యారోగ్య శాఖ దక్కిందని ఎందుకు గుర్తించలేకపోతోంది? శ్రీధర్ బాబు సతీమణికి వైద్య ఆరోగ్యశాఖలో కీలక పదవి అని రాస్తేనే మీడియా సంతృప్తి చెందుతుందా? ఏంటో విలువల సారానికి నిలువుటద్దంగా ఉండాల్సిన మీడియా ఇలా దిగజారిపోవడమేమిటో..