Telangana Journalists : ఉద్యమ సమయంలో పురుడు పోసుకున్న పత్రిక అది. ఉద్యమ ఆకాంక్షను మాత్రమే వ్యక్తం చేసే పత్రికలాగా దాన్ని నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటనలు వచ్చాయి. కాకపోతే ఒక రాజకీయ పార్టీకి మాత్రమే ఆ పత్రిక వత్తాసు పలికింది అనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆ పత్రిక చేతులు మారింది. పూర్తిగా అధికార కరపత్రంగా మారింది. గత పది సంవత్సరాలుగా తెలంగాణలో అధికార పార్టీకి ఆ పత్రిక డప్పు కొట్టింది. అధికారంలోకి రావడమే ఆలస్యం.. నాటి ప్రభుత్వ పెద్దలు ఆ పత్రికను సొంతం చేసుకున్నారు.. ఆ పత్రికకు అనుబంధంగా కొనసాగిన ఛానల్ కూడా వారి వశమైపోయింది. దీంతో ఆ పత్రిక, ఆ ఛానల్ పదేళ్లపాటు గిట్టని వాళ్లపై దర్జాగా బురద చల్లాయి. రెండవ మాటకు తావు లేకుండా రాళ్లు వేశాయి.. కేవలం అధికార పక్షానికి పూర్తి స్పేస్ కేటాయించాయి. ఆ సమయంలో అప్పటి అధికార పార్టీ పెద్దలు ఆ పత్రికలో పని చేస్తున్న వారిని పట్టించుకోలేదు.. చివరికి జీతాల పెంపుదల విషయాన్ని కూడా వినిపించుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రికలో పనిచేస్తున్న ఉపసంపాదకులు రోడ్డు మీదకి ఎక్కారు. అయినప్పటికీ నాటి ప్రభుత్వ పెద్దలు వీసమెత్తు కూడా స్పందించలేదు. పైగా అప్పట్లో వచ్చిన కొత్త సంపాదకుడికి ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో అతడు వారితో చర్చలు జరిపాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఉద్యోగాలు పోతాయని భయంతో డెస్క్ లో పనిచేసే ఉపసంపాదకులు బెట్టు వీడి.. కుక్కిన పేను లాగా పనిచేశారు.
సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ పార్టీ అధికారాన్ని ప్రజలు తొలగించారు. కొత్త పార్టీకి అధికారం కట్టబెట్టారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు పేజీలకు పేజీలు ప్రింట్ చేసిన ఆ పత్రిక సగానికి కుదించింది. ఉద్యోగులను కూడా కుదించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. కొవిడ్ సమయంలోనే ఆ పత్రికలో పనిచేసిన చాలామంది ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించారు. బయట ఉపాధి దొరకని సమయంలో నడి బజార్ లో నిలబెట్టారు. అప్పుడు కూడా నాటి ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు.
ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు పత్రిక అవసరం తెలిసిన తర్వాత.. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కిందికి దిగివచ్చారు. పది సంవత్సరాల తర్వాత ఆ పత్రిక కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఇకపై అలా జరగదని, ఎవర్నీ ఉద్యోగం నుంచి తొలగించకూడదని, పెద్ద సార్ వస్తారని, కచ్చితంగా దీని గురించి పట్టించుకుంటారని నాటి ప్రభుత్వంలో షాడో గా పనిచేసిన వ్యక్తి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో హామీలు ఇచ్చారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.. బాగానే ఉంది.. అసలు అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు కదా.. జాకెట్ల తరహాలో యాడ్స్ వచ్చినప్పుడే లెక్కలోకి తీసుకోలేదు కదా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ జరుగుతాయా.. ఇచ్చిన హామీలు నెరవేరుతాయా.. ఈ ప్రశ్న అంటున్నది మేము కాదు.. ఆ పత్రికలో పని చేస్తున్న జర్నలిస్టులు..