Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి.. అన్ని పార్టీలకన్నా ముందే మేనిఫెస్టో రిలీజ్ చేసి.. ప్రచారంలో దూసుకుపోతోంది అధికార బీఆర్‌ఎస్. ఈసారి గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయం నుంచి మేనిఫెస్టో రూపకల్పన వరకూ ఆచితూచి అడుగులు వేసింది. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
యూత్ ఓటర్లు లక్ష్యంగా..
తెలంగాణలో యువ ఓటర్లు ఎక్కువగా బీఆర్‌ఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారి యూత్ టార్గెట్‌గా మేనిఫెస్టో రూపొందించింది. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక, ప్రశ్నపత్రాల లీకేజీలో అసంతృప్తిగా ఉన్న యువతను తమవైపు తిప్పుకునేందకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నీళ్లు నిధులు, నియామకాలే ఎజెండాగా సాధించుకున్న తెలంగాణలో నియామకాలు జరుగడం లేదన్న అభిప్రాయం యువతలో ఉంది. పదేళ్లలో ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదీ కూడా లీకేజీలతో మూలనపడింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి అసంతృప్తిని ఓట్లుగా మల్చుకునేందుకు కాంగ్రెస్ సరైన ప్రణాళిక వేసింది.
మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్..
నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండ్ వేస్తామని చెప్పడం కాదు.. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తామో కూడా జాబ్ క్యాలెండ్ లో కాంగ్రెస్ వివరించింది. ఇది నిరుద్యోగ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులో లేకపోతే ఈ మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్ యువతను ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గేలా చేసే అవకాశాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నియామకాల విషయంలో పారదర్శకంగా లేదు. పరీక్షలు పెట్టినా కష్టపడిన వారికి వస్తాయన్న నమ్మకం లేనట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇంత జరిగినా టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయకపోవడమే దీనికి కారణం.
ఆకర్షిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో..
తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతీ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది. అనుకూల అంశాలన్నీ తమకు మరింత అనుకూలంగా మార్చుకుంటోది. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో ఇందుకు నిదర్శనం. అన్నివర్గాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తంగా.. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత ఓట్లను ఏకపక్షంగా పొందడానికి మేనిఫెస్టోలో మంచి ప్లానే వేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.