Tunnel Roads: నాలుగు వరుసల దారులు.. కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జి బై పాస్ లు.. ఇవి కూడా సరిపోకపోవడంతో మెట్రో రైలు.. అయినప్పటికీ హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడం లేదు. ఏటికేడు రోడ్లను విస్తరిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. పైగా ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరుగుతోంది.. గత ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల అండర్ బ్రిడ్జి బైపాస్ లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో మాదిరిగా టన్నెల్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఐదు ప్రాంతాలను అధికారులు ఇందుకు ఎంపిక చేశారు.. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కిలోమీటర్ల మేర సొరంగం లాగా టన్నెల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఆయన పలుమార్లు భేటీ అయ్యారు.. హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.. అంతేకాదు నగర ప్రజలను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. దీని కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు అని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు టన్నెల్ రోడ్ల ప్రతిపాదన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన దీనికి ఓకే చెప్పినట్టు తెలిసింది. అయితే అధికారులు టన్నెల్ రోడ్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకుగానూ టెండర్లను పిలిచినట్టు సమాచారం. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్న ఐదు ప్రాంతాల్లో టన్నెల్ రోడ్లు నిర్మిస్తారని తెలుస్తోంది. దుబాయ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అక్కడి ప్రభుత్వం అక్కడ పలుచోట్ల టన్నెల్ రోడ్డు నిర్మించింది.. ఆ టన్నెల్ రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతి లభిస్తోంది.. ఈ క్రమంలోనే ఐదు ప్రాంతాల్లో ఈ తరహా రోడ్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో సాయంత్రం వేళ విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.. వర్షం కురిస్తే చాలు ఈ ప్రాంతం మొత్తం ఎక్కడికక్కడే స్తంభించిపోతోంది. ఈ నేపథ్యంలో ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా ఖాజా గూడ, నానక్ రామ్ గూడ వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐటీసీ కోహినూర్ నుంచి జే ఎన్ టీ యూ మధ్యలో మైండ్ స్పేస్ జంక్షన్ వరకు అంటే దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో టన్నెల్ రోడ్డు నిర్మిస్తారు.
ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వరకు మధ్యలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ను కలుపుతూ ఏడు కిలోమీటర్ల వరకు టన్నెల్ రోడ్డు నిర్మిస్తారు.
జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మసాబ్ ట్యాంక్ వరకు ఆరు కిలోమీటర్ల పరిధిలో టన్నెల్ రోడ్డు నిర్మిస్తారు..
నాంపల్లి నుంచి చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్డు వయా చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్ వరకు 9 కిలోమీటర్ల పరిధిలో టన్నెల్ రోడ్డు నిర్మిస్తారు. ఈ ఐదు ప్రాంతాల్లో ముందుగా మించి వాటి ద్వారా ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం అయితే నగరం మొత్తం విస్తరిస్తారు.