TS Cabinet Meeting: తెలంగాణ కొత్త సచివాలయం బీఆర్. అంబేద్కర్ సమీకత సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం గురువారం జరుగబోతోంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి కేఉసీఆర్ అనుమతితో ఈసారి ఎక్కువ అంశాలు టేబుల్ ఎజెండాగానే మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ఫైల్స్‌తో సహా మొత్తం 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సమాలోచనలు జరిపి మంత్రులు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్మారకజ్యోతి ప్రారంభ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది.
– అలాగే పోడు పట్టాల అంశంపై ఒక స్టేటస్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల ఆదివాసీ, గిరిజనులకు సుమారు 4 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాలు పంచే కార్యక్రమ తేదీపై కూడా ఇదే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
– గహలక్ష్మి పథకం మార్గదర్శకాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా మంత్రివర్గం సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు తెలిసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లకు ఆమోదం..
గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారుఖ్ హుస్సేన్ పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది. ఆ ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గంలో చర్చించే ఆస్కారం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం రద్దు ఆలోచన..
తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా, అధికార బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఎత్తులు వేస్తున్నారు. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో డిసెంబర్, జనవరిలో ప్రభుత్వాల కాలపరిమితి ముగిసే ఐదు రాష్ట్రాల ఎన్నికలను మరో ఆరు నెలలు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు ఆర్డినెన్స్ తెచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరు నెలల ముందే రద్దు చేస్తే కేంద్రాని గడువు పొడిగించే చాన్స్ లేకుండా చేయాలని కేసీఆర్ ఆలోచన. ఆడినెన్స్ ఆరు నెలల మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 6న ప్రభుత్వం రద్దు చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపైనా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.