Telangana Assembly Elections: ఓవర్ టూ ఢిల్లీ.. ఏక్షణమైనా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..!!

క్షేత్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు కూడా చివరిదశకు వచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంఘం బృందం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించింది.

Written By: Raj Shekar, Updated On : October 6, 2023 11:39 am

Telangana Assembly Elections

Follow us on

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడు రోజుల తెలంగాణ పర్యటన పూర్తిచేసుకున గురువారం ఢిల్లీ వెళ్ళింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఈ మూడు రోజుల కసరత్తు పూర్తి చేసింది. అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అటు రాజకీయ పార్టీలు ఎన్నికలకు కసరత్తు వేగవంతం చేశాయి. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ గురించి ఢిల్లీ నుంచి కీలక సమాచారం అందుతోంది.

నేడు కీలక సమావేశం..
పోలింగ్‌కు ముందు కసరత్తు అతిత్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను సిఇసి రాజీవ్‌ కుమార్‌ ఆదేశించారు. నేడు ఢిల్లీలో జరిగే సిఇసి సమావేశంలో ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులపై మరోసారి చర్చించనున్నారు. ఐదు రాష్ట్రాలకు చెందిన ఎన్నికల పరిశీలకులతో సీఈసీ నేడు నిర్వహించే సమావేశంలో ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేయనుంది.

చివరి దశలో సమీక్షలు..
క్షేత్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు కూడా చివరిదశకు వచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంఘం బృందం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ బృందం చివరిగా తెలంగాణలో పర్యటించింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో అన్ని అంశాలపై ఇసి చర్చించింది.

నియమావళికి తుది రూపు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్ధంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన తుది వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ముఖ్య అధికారులతో సమీక్ష తరువా తుది ప్రణాళికకు ఎన్నికల సంఘం ఆమోదం తెలపనుంది. ఇప్పటికే క్షేత్ర స్థాయి నివేదికలు సిద్దమయ్యాయి.

ఏ క్షణమైనా షెడ్యూల్..
ఈ నెల 10వ తేదీకి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలంగాణలోని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే, ముందుగా 6వ తేదీన షెడ్యూల్ ఉంటుందని భావించినా… 9వ తేదీ లేదా 10 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించి డిసెంబర్ లో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీ సమాచారం ఇలా..
ఢిల్లీ నుంచి అధికారుల కసరత్తు అధారంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 12న తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల దాదాపు ఖాయమని చెబుతున్నారు. దీంతో, ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం పూర్తయిన తరువాత ఏ క్షణం అయినా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.