CM Revanth Reddy: నిక్షేపంగా ఉన్న పాత సచివాలయాన్ని కూల కొట్టాడు. శ్వేత వర్ణంలో మెరిసిపోయే సచివాలయాన్ని నిర్మించాడు. అంతేకాదు 22 ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేశాడు. రేవంత్ కు కష్టపడే పని లేకుండా కెసిఆర్ చేశాడు.. ఇదే కదా నిన్నటి వరకు రాష్ట్రంలో జరిగిన చర్చ.. కానీ ఇక్కడే అసలు విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. భారీగా డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఖాళీ పెట్టలే కనిపిస్తున్నాయి.. అని కదా రేవంత్ మొన్న విలేకరుల సమావేశంలో అన్నది.. ఇప్పుడు అది అక్షరాల నిజం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి అప్పుల దారి దాదాపుగా క్లోజ్ అయింది. అంటే బహిరంగ మార్కెట్లో రుణాలు లభించడం దాదాపు కష్టమే. మూడు నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదిత అప్పులు పూర్తయ్యాయి. బడ్జెట్లో 40,615 కోట్ల మేర రుణ ప్రతిపాదన అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే డిసెంబర్ నాటికే 39,551 కోట్ల అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. కాగ్ తాజా నివేదికలో వెల్లడించింది.
ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో వాటి అమలు బాధ్యతను చేపట్టింది. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగానే ఉంటుందని తెలుస్తోంది.. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం అప్పుల మీద అప్పులు చేయడంతో నూతన ఆర్థిక సంవత్సరం మొదలయ్యే దాకా కొత్తగా అప్పులకు మార్గం దాదాపు ముగిసిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగించేందుకు మరొక మూడు నెలల సమయం ఉంది. అయితే బడ్జెట్లో ప్రతిపాదిత అప్పులను గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే లాగేసింది. గత బడ్జెట్లో 40 వేల 615 కోట్ల అప్పును ప్రతిపాదిస్తే.. ఇందులో డిసెంబర్ నాటికే 39,551 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నవంబర్ నెల దాకా రాష్ట్రం 38,151 కోట్ల అప్పులు చేసింది. ఈ నివేదికను కాగ్ విడుదల చేసింది. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12న 500 కోట్లు, 19వ తారీఖున 900 కోట్లు కలిపి మొత్తం 1400 కోట్ల అప్పు చేసింది. మరి ఈ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే మూడు నెలల కాలానికి అప్పులు పుడతాయి? అనే సందిగ్ధం నెలకొంది. వచ్చే మూడు నెలలను నెట్టుకు రావడం కొత్త ప్రభుత్వానికి ఒక విధంగా సవాలే..
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించింది. కేవలం ఒక్క రోజే దాదాపు 82 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల దరఖాస్తులే 79 వేల పైచిలుకు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అంటే ఈ పథకాలపై ప్రజల్లో ఎంత ఆత్రుత ఉందో ఇట్టే అర్థమవుతుంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కచ్చితంగా ఈ హామీలను నిలుపుకోవాల్సి ఉంటుంది. పైగా మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఆరు గ్యారంటీలను కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అప్పులకు దారులు మూసుకుపోయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక నవంబర్ నాటికి రాష్ట్ర రాబడుల కింద 1,49,316 కోట్లు సమకూరాయి. అంటే గత ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో సమకూరిన రాబడిలో ఇది కేవలం 57.46% మాత్రమే. ఈసారి మూలధన, రెవెన్యూ రాబడుల కింద మొత్తం 2,59,861 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. నవంబర్ నాటికి 1,11,141. 37 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇది వాస్తవ రాబడిలో 51% మాత్రమే. ఇక ఈ రెవెన్యూలో జీఎస్టీ కింద 30,047.59 కోట్లు వచ్చాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ కింద 9,354.84 కోట్లు సమకూరాయి. సేల్స్ టాక్స్ కింద 19,591.91 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల కింద 14,607.58 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద 8,117.58 కోట్లు వచ్చాయి. మొత్తంగా నవంబర్ నాటికి 1,44,034.48 కోట్లు వ్యయం అయ్యాయి. ఇందులో ప్రధానంగా పథకాల కోసం 56,037 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం 14,687 కోట్లు, వేతనాల కోసం 26,548 కోట్లు, పెన్షన్ల కోసం 11,316 కోట్లు, రాయితీల కోసం 6,156 కోట్లు ఖర్చయ్యాయి.