Telangana Politics: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలందరినీ ఆకర్షిస్తున్నది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన బలమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును లాగేసుకుంది. అంతేకాదు మరి కొంతమందిని పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. దీనికి తోడు ఖమ్మం లో రాహుల్ గాంధీని ప్రత్యేక అతిథిగా తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఏకంగా నాలుగు లక్షల మంది దాకా కార్యకర్తలు వచ్చారు. ఇన్ని సానుకూల పవనాలు కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. అయితే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు కోరిక మేరకే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిని నియమించింది అని ఆరోపించడం మొదలుపెట్టింది. అంతేకాదు బిసి కార్డును తెరపైకి తీసుకువచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ వల్లే భారతీయ జనతా పార్టీ ఎదిగిందని చెబుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం విరివిగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. మూడు సంవత్సరాలలో బండి సంజయ్ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, దానిని గుర్తించలేని అధిష్టానం ఆయనను అర్ధాంతరంగా పక్కన పెట్టిందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి ఆయనను మార్చి కిషన్ రెడ్డి నియమించడం.. బీసీ నేతల పార్టీ అని చెప్పుకునే బిజెపికి బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టం చేస్తోందని వారు ధ్వజమెత్తారు.
కెసిఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారని.. అమిత్ షాను కలిసిన మంత్రి కేటీఆర్.. తమకు అనుకూలంగా ఉన్నవారిని అధ్యక్షుడిగా నియమించుకున్నారని ఆరోపించారు. అలాగే కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారని వారు గుర్తు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి, బీఆర్ఎ స్ ఒక్కటేనని, బీసీ వ్యతిరేక పార్టీ బిజెపి అన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపగల సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం అనే సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు, ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీకి పెరిగిన గ్రాఫ్ కారణంగా ఈ సామాజిక వర్గం క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారని తెలుస్తోంది. మరి దీనిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది.