BCCI: టి20 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టు యువ టీమ్ ను సిద్ధం చేస్తోంది. ఈ టీమ్ ఎంపికలో ఎటువంటి మొహమాటలకు తావు లేకుండా కఠిన నిర్ణయాలను కూడా బీసీసీఐ తీసుకుంటుంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనలో మ్యాచులు ఆడనున్న భారత జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. అనూహ్యంగా ఈ జట్టులో ప్రస్తుత భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లకు స్థానం లభించలేదు.
భారత జట్టు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో విజేతగా నిలిచి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ పదేళ్లలో ఐసీసీ అనేక మెగా టోర్నీలను నిర్వహించింది. ఇప్పటి వరకు ఒక్క టోర్నీలో కూడా భారత జట్టు విజేతగా నిలవలేకపోయింది. ముఖ్యంగా మూడేళ్లలో రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టినప్పటికీ దారుణమైన పరాభవంతో రెండుసార్లు టైటిల్ చేజిక్కించుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓటమి తర్వాత భారత జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో బిసిసిఐ సంస్కరణలకు సిద్ధమైంది.
యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ..
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్తోంది. ఈ నెల 12 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్లు ఆడనుంది భారత జట్టు. అయితే, ఈ సిరీస్ కోసం రెండు టీములను బీసీసీఐ సిద్ధం చేసింది. రోహిత్ శర్మ సారధ్యంలోని వన్డే, టెస్ట్ మ్యాచ్లకు ఒక టీమును, టి20 మ్యాచ్ లకు మరో టీమును సెలెక్టర్లు ఎంపిక చేశారు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టి20 జట్టును మాత్రం పూర్తిగా యువ ఆటగాళ్లతో నింపింది బీసీసీఐ. గతేడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన నిర్ణయాలను తీసుకోవాలని భావించింది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ కు యువకులతో కూడిన జట్టును సిద్ధం చేయాలని నిర్ణయించి.. అందుకు అనుగుణంగా హార్దిక పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టును సిద్ధం చేసింది. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు కూడా అదే యువ జట్టును ఎంపిక చేసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై వేటు..
టి20 జట్టులో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటుదక్కలేదు. 2024 లో టి20 వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐ అందుకు అనుగుణంగానే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టుతో వెస్టిండీస్ పర్యటనకు వెళ్తోంది. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై వేటు వేసింది. ఇక వీరిద్దరి టి20 కెరియర్ ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 148 టి20 మ్యాచ్ లు ఆడగా 31.32 సగటుతో 3853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 118 పరుగులు చేయగా, 58 క్యాచ్ లు అందుకున్నాడు. ఇక టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 115 టి20 మ్యాచ్ లు ఆడాడు. 2010 తొలి టి20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ.. 52.7 సగటుతో 4008 పరుగులు చేశాడు. 58 క్యాచ్ లు అందుకున్నాడు.