Thatikonda Rajaiah Comments On Kadiyam Srihari: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ గెలిచిన నియోజకవర్గాలు రెండు. అందులో మొదటిది జనగామ అయితే, రెండవది స్టేషన్ ఘన్ పూర్. ఈ నియోజకవర్గంలో గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజయ్య ఉన్నారు. రాజయ్య కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు.. ఆ స్థానంలో కడియం శ్రీహరికి ఆయన అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కడియం శ్రీహరి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా తన కుమార్తె కావ్యకు కెసిఆర్ టికెట్ ఇస్తే.. టికెట్ నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.. తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకొని.. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించుకున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటువేయాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి.. సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ కు గడ్డం ప్రసాద్ కుమార్ కు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గానికి ఉపఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది . గులాబీ పార్టీ తరఫు నుంచి తన పోటీ చేస్తానని రాజయ్య చెబుతున్నారు. అంతే కాదు కడియం శ్రీహరి అని కచ్చితంగా ఓడిస్తానని స్పష్టం చేస్తున్నారు.
కడియం శ్రీహరికి, రాజయ్యకు గతంలో రాజకీయ విరోధం ఉండేది కాదు. ఎప్పుడైతే శ్రీహరి 2023 శాసనసభ ఎన్నికలలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారో.. అప్పటినుంచి వీరిద్దరి మధ్య వైరం మొదలైంది.. పార్లమెంటు ఎన్నికల్లో రాజయ్య శ్రీహరి కుమార్తెను ఓడిస్తానని సవాల్ చేశారు. కానీ ఆ సవాల్ నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు గనక ఉప ఎన్నికలు వస్తే తాను స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. శ్రీహరి మీద గెలుస్తానని చెబుతున్నారు రాజయ్య. అంతే కాదు కడియం శ్రీహరికి వ్యతిరేకంగా మీసం మేలేసి సవాల్ విసురుతున్నారు.
” స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధమే. మీసం మేలేసి మరీ చెబుతున్నా. కచ్చితంగా ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తాను. కడియం శ్రీహరి మాట మీద ఉండే మనిషి కాదు. ఆయన ఎలాంటివాడో అందరికీ తెలుసు. దోచుకోవడం దాచుకోవడం మినహా ఆయనకు తెలిసింది ఏమీ లేదు. ప్రజలకు కూడా ఆయన ఏమీ చేయలేదని” రాజయ్య వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.