CM Revanth Reddy: రేవంత్ నిర్ణయం వెనక కారణం అదేనంటా..!

తెలంగాణ సాగు,త్రాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కెసిఆర్ పూర్తిగా తన మార్క్ ను చూపించారు. ఏకంగా అసెంబ్లీలోనే ఈ ప్రాజెక్టుపై ఒక ఇంజినీర్ మాదిరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు.

Written By: Neelambaram, Updated On : May 30, 2024 3:24 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కెసిఆర్,బీఆర్ఎస్ పార్టీని గురిచేసి దెబ్బ కొడుతున్నారు. అదను చూసి ఒక్కో అస్త్రాన్ని మెల్లిగా ప్రయోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వల్లే సాధ్యమైందనే ప్రచారాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైంది. అందుకు అనుగుణంగానే కెసిఆర్ కూడా ఎక్కడా తెలంగాణ మేధావులు,ఉద్యమకారులు, అమరవీరుల పేర్లను రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. వారి త్యాగాలు,పోరాటాలను రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా అధికారికంగా ఎక్కడా వారికి పెద్దగా ప్రయారిటీ కల్పించలేదు. ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని మాత్రం గత ప్రభుత్వం నిర్మించగలిగింది. రాష్ట్ర సాధనలో ఇంతకుమించి మేధావులు,అమరవీరులు, ఉద్యమకారులను కెసిఆర్ గుర్తించిన దాఖలాలు లేవు.

తెలంగాణ సాగు,త్రాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కెసిఆర్ పూర్తిగా తన మార్క్ ను చూపించారు. ఏకంగా అసెంబ్లీలోనే ఈ ప్రాజెక్టుపై ఒక ఇంజినీర్ మాదిరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ ఆయన అమరవీరులు,ఉద్యమకారుకు అసలు ప్రాధాన్యతనే ఇవ్వలేదు. నిజాం,కాకతీయ రాచరిక పాలనకు మాత్రమే ఆయన ప్రయారిటీ ఇచ్చారనే విమర్శలను ఎదుర్కొన్నారు. కాకతీయుల పరిపాలనలో పద్మనాయకులైన వెలమలు చాలా కీలకంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన వారి గుర్తుగానే కాకతీయ కళా తోరణాన్ని తెలంగాణ అధికారిక చిహ్నంలో పొందుపరిచారనే విమర్శలున్నాయి. దీంతో పాటు మైనార్టీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచేందుకే చార్మినార్ ను అధికారిక చిహ్నంలో పొందుపరచారనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటనేది కెసిఆర్ ఒక్కరు వల్లే సాధ్యం కాలేదనే భావనను రేవంత్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ అధికారిగా చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు తొలగించేసింది. కొత్తగా అమరవీరుల స్థూపాన్ని,రెండు వైపుల రెండు వరి కంకులను జత చేసింది. తద్వారా రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరుల త్యాగానికి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం ఉద్యమకారులు, అమరవీరులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ, రేవంత్ రెడ్డి వారికిప్పుడు సముచిత స్థానం కల్పించడంతో..కెసిఆర్ కు చెక్ పెట్టేసినట్లైంది. అంతేకాక కాళేశ్వరం లోతుపాతులను ఎత్తి చూపి..ఆ ప్రాజెక్టుపై తరువాత ఎంక్వయిరీ చేయించడం ద్వారా సాగునీటి విషయంలో ఈ పదేళ్ల కాలంలో కెసిఆర్ పెద్దగా చేసింది ఏం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు సక్సెస్ అయ్యారు. మొత్తానికి తెలంగాణకు తానే పెద్ద దిక్కని చెప్పుకున్న కేసీఆర్.. సంగతి ఏంటో తేల్చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.