Teenmar Mallanna: తెలుగు రాష్ట్రాలలో వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్నాయి. కాకపోతే ఈ వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాయి. మంత్రి పదవులు వస్తున్నప్పటికీ.. అవి ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. సహజంగానే ఈ పరిణామం వెనుకబడిన వర్గాలలో ఆగ్రహానికి కారణమవుతున్నది. అందువల్లే ఆర్ కృష్ణ ఎలాంటి వాళ్ళు బీసీ ఉద్యమాన్ని కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బీసీలకు రాజ్యాధికారం దక్కడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనూహ్యంగా బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే రాజ్యాధికారం సాధించాలని బీసీలు ఎప్పటినుంచో కలలు కంటున్నారు. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఉద్యమం చేస్తున్న తీరు మరో విధంగా ఉంది. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!*
ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ వేరే అగ్రకులాలను దూషించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని దారుణంగా తీరుతున్నారు. వాస్తవానికి ఆ సామాజిక వర్గంలో వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. అంతకుముందు నిజాం వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తన ఆస్తులను కోల్పోయారు. ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేశారు. వాస్తవానికి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాల్సిన తరుణంలో అత్యంత హీనమైన భాషను వాడటం వల్ల తీన్మార్ మల్లన్న ఒక సామాజిక వర్గానికి టార్గెట్ అవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టింది. అదంతా తప్పుల తడకని.. ఓ సామాజిక వర్గం మెప్పుకోసమే అడ్డగోలుగా వివరాలు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వాస్తవానికి ఈ ఆరోపణలు సత్య దూరంగా మిగిలిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వం చేసిన ఘనన తప్పుల తడకలాగా ఉంది అని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ. వాటిని పకడ్బందీ ఆధారాలతో నిరూపిస్తే సరిపోయేది. అలాకాకుండా ఆయన ఆరోపణలతోనే ఆగిపోయారు. పైగా రాయడానికి వీల్లేని భాషలో విమర్శలు చేశారు.. వాస్తవానికి ఇటువంటి పరిణామం పెడపోకడలకు దారితీస్తుంది. సమాజంలో వికృత విధానాలకు నాంది పలుకుతుంది. మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం హింసాహిత మార్గం తీసుకుంది అంటే దానికి కారణం అక్కడి నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ లాంటి భాష వాడటమే.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సహించలేనివి. సమాజం నుంచి నిరసన ఆశించిన స్థాయిలో వ్యక్తం కాకపోయినప్పటికీ.. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. పైగా కవితతో పొత్తు ఏంటి అని మాట్లాడుతూ.. ఆమె ఏమైనా ఐశ్వర్యరాయా అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం ఆయన నేలబారుతనం భాషకు నిదర్శనం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీన్మార్ మల్లన్నకు సబబుగానే అనిపించవచ్చు. పైగా కేసీఆర్ కుటుంబం ఆయనను గతంలో పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న బాధ్యతాయుతమైన పాత్రికేయుడు.. అన్నిటికంటే శాసనమండలి సభ్యుడు. అందువల్ల ఆయన మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. హుందాతనంతో విమర్శలు చేయాలి. అంత తప్ప ఇలాంటి చవక బారు భాష మాట్లాడి.. నేలబారుతనం వ్యాఖ్యలు చేస్తే మొదటికే మోసం వస్తుంది.. పైగా ఆయన బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. బీసీలకు జరుగుతున్న సమస్యల మీద మాట్లాడితే ఆయన తిరుగులేని నాయకుడు అవుతారు. ఇలానే అడ్డగోలుగా మాట్లాడితే మరింత చులకన అవుతారు. ఉద్యమం చేయడానికి.. అడ్డగోలుగా మాట్లాడటానికి చాలా తేడా ఉంది. ఆ విషయం తీన్మార్ మల్లన్న గుర్తిస్తే మంచిది.