https://oktelugu.com/

Telangana unemployed protest : లైవ్ ఏది సార్.. మైక్ పెట్టిన ఏబీఎన్ రిపోర్టర్ కు చుక్కలు చూపించిన నిరుద్యోగులు.. వైరల్ వీడియో

నిరుద్యోగులు నిరసన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి.. దానిని కవర్ చేసేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఆ ఛానల్ ప్రతినిధిని చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు.."మేము ఈ స్థాయిలో ఆందోళన చేస్తుంటే మీరు కవరేజ్ ఎందుకు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి సేవలో తరించిపోతున్నారు కదా.. మేము డీఎస్సీ వాయిదా వేయమంటే వేయడం లేదు.

Written By:
  • Bhaskar
  • , Updated On : July 16, 2024 / 07:46 PM IST
    Follow us on

    Telangana unemployed protest :  మీడియా నిష్పక్షపాతంగా ఉండాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను సొంత వ్యాఖ్యానం లేకుండా చూపించాలి. అప్పుడే మీడియా అంటే ప్రజలకు గౌరవం ఉంటుంది. నూటికి నూరు శాతం నమ్మేందుకు అవకాశం ఉంటుంది. కానీ తెలుగు నాట పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు సొంతం మీడియాను కలిగి ఉన్నాయి. న్యూట్రల్ ముసుగులో కొన్ని ఛానళ్లు, పత్రికలు వివిధ పార్టీలకు భజన చేస్తున్నాయి. ఆయా పార్టీలకు అనుకూలంగా వార్తలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎన్ని రకాల విమర్శలు వచ్చినప్పటికీ ఆ మీడియా సంస్థలు తమ ధోరణి మార్చుకోవడం లేదు. పైగా ఇటీవల అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు నేరుగానే ఊడిగం చేశాయి. ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసే వార్తలను ప్రచురించాయి, ప్రసారమూ చేశాయి.. మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటం.. ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో.. ఆ పత్రికలు, ఛానళ్లు రూటు మార్చాయి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు భజన చేయడం మొదలుపెట్టాయి.

    నిరుద్యోగులకు కడుపు మండింది

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం డీఎస్సీ ద్వారా గవర్నమెంట్ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి డిఎస్సీ నోటిఫికేషన్ వెయ్యలేదు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో అవి వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత పది సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో సహజంగానే నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతకూ తగ్గకపోవడంతో నిరుద్యోగులు పలురూపాలలో నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కోచింగ్ సెంటర్లకు, పోటీ పరీక్ష కేంద్రాలకు నెలవైన అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు చెదరగొట్టారు..

    ఓ ఛానల్ పై ఆగ్రహం

    నిరుద్యోగులు నిరసన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి.. దానిని కవర్ చేసేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఆ ఛానల్ ప్రతినిధిని చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు..”మేము ఈ స్థాయిలో ఆందోళన చేస్తుంటే మీరు కవరేజ్ ఎందుకు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి సేవలో తరించిపోతున్నారు కదా.. మేము డీఎస్సీ వాయిదా వేయమంటే వేయడం లేదు.. ఈ విషయాన్ని మీరు చూపించడం లేదు. రేవంత్ రెడ్డికి భజన చేయడంలోనే మీరు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ అనుకూల వార్తలు ప్రసారం చేస్తూ.. తెలంగాణలో జరుగుతున్న నిరసనలను, ఆందోళనలను కవర్ చేయడం లేదంటూ” నిరుద్యోగులు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధిపై ఫైర్ అయ్యారు.

    సోషల్ మీడియాలో..

    నిరుద్యోగులు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కొంతమంది తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిని సహజంగానే భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఇదే సమయంలో మరి కొంతమంది ఏబీఎన్ ఛానల్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు..” నిరుద్యోగులు చేసేది నిజమైన నిరసన అయితే ప్రచారం కోరుకోవడం దేనికి.. ఏబీఎన్ ఛానల్ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి? గత పది సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేయగానే వాయిదాల కోసం లేనిపోని నిరసనలు చేపడుతున్నారు.. ఇది ఎంతవరకు న్యాయం.. గత ప్రభుత్వం గ్రూప్- 1 నిర్వహిస్తే పేపర్ లీకేజీ అయింది.. రెండుసార్లు పరీక్ష వాయిదా పడింది. అప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే భారత రాష్ట్ర సమితి నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదా.. ఆ సమయంలో టీ న్యూస్ ఆందోళనలను కవర్ చేసిందా” అంటూ ప్రశ్నిస్తున్నారు.