Telangana Tiger Population Increase 2026: అటు చూస్తే నల్లమల్ల.. ఇటు చూస్తే వికారాబాద్.. మధ్యలో ఆదిలాబాద్.. ఉమ్మడి ఖమ్మం.. ఉమ్మడి వరంగల్.. విస్తారంగానే మనకు అటవీ ప్రాంతం ఉంది. చాలావరకు ఇందులో అటవీ భూములు నాశనమైపోయినప్పటికీ.. దట్టమైన అడవుల విషయంలో తెలంగాణ కాస్తానయమే. అయినప్పటికీ ఈ ప్రాంతాలలో ఒకప్పుడు ఉన్నట్టుగా పులులు ఉండేవి కావు. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో ఔత్సాహిక పర్యాటకులు సఫారీ టూర్లకు.. క్రూరమైన మృగాలను చూడడానికి కేరళ లేదా తమిళనాడు లేదా కర్ణాటక వెళ్తుంటారు.. తడోబా ఫారెస్ట్ లో సఫారీ ఉన్నప్పటికీ.. అందులో పులులు కనిపించేది అప్పుడప్పుడు మాత్రమే.
ఇప్పుడు తెలంగాణలో పై ఉపోద్ఘాతం లాంటి పరిస్థితులు మారిపోతున్నాయి. అడవుల విస్తీర్ణం పెరుగుతోంది. అందులో ఉండే పులుల సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అడవులు, పులుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఆమ్రాబాద్ ప్రాంతంలో గతంలో 12 మాత్రమే పులులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 42 కు చేరుకుంది. దీనిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. దక్షిణాది రాష్ట్రాలలోనే పచ్చదనంలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఏకంగా 24.69 శాతం ఉన్నాయి. జాతీయ సగటు 23.59 ఉంటే.. తెలంగాణలో మాత్రం అంతకుమించి అనే స్థాయిలో పచ్చదనం ఉంది. ఈ విషయాలు ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో తెలిశాయి.
నల్లమల్ల ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో 2018లో 12 వరకు ఉన్నాయి పులులు. ఇప్పుడు ఆ సంఖ్య 42 కు చేరుకుంది.. తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న క్రమంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని తెలుస్తోంది. 2024 – 25 సంవత్సరంలో ప్రభుత్వం 19.3 కోట్ల మొక్కలు నాటింది. 2025 -26 కాలంలో 15.73 కోట్ల మొక్కలు నాటింది. స్వార్థంగా రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 27, 668 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. రాష్ట్ర భూభాగంలో ఇది 24.69 శాతం. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,939 మొక్క, వృక్షాల జాతులు ఉన్నాయి. 365 పక్షి జాతులు ఉన్నాయి. 2022లో జాతీయ పులుల గణన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. నాడు వెల్లడించిన నివేదికలో కవ్వాల్ ప్రాంతంలో ఏడు పెద్ద పులులు, 41 చిరుత పులులు ఉన్నట్టు తేలింది. అయితే తాజా నివేదికలో ఈ ప్రాంతంలో ఎన్ని పులులు ఉన్నాయనే విషయాన్ని చెప్పలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో 22.87, మహారాష్ట్రలో 20.13, కర్ణాటక లో 19.96, తమిళనాడు లో 17.83 శాతం అటవీ విస్తీర్ణం ఉంది.
