Telangana Police: మత్తు.. దీనికోసం చాలామంది ఆరాటపడుతుంటారు. మత్తు అనేది తాత్కాలికమైన భ్రాంతి అయినప్పటికీ.. ఇందులో మునిగి తేలాలని చాలామంది భావిస్తుంటారు. ఇందులో భాగంగానే మొత్తం కలిగించే పదార్థాలను తీసుకుంటారు. ఒకప్పుడు మత్తు అనేది సారాయి ద్వారా లభించేది. కానీ ఆ తర్వాత మత్తుకు సంబంధించిన రూపాలు మారిపోయాయి. మద్యం.. ఇతర పదార్థాలు అందుబాటులోకి రావడం పెరిగిపోయింది.
కొంతకాలంగా మద్యం తాగడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. తినగా తినగా వేము తీయగా ఉన్నట్టు.. మద్యం అతిగా తాగడం వల్ల చాలామందికి ఆ మత్తు సరిపోవడం లేదు. దీంతో అంతకంటే ఎక్కువ ప్రభావం చూపించేది కావాలని కోరుకుంటున్నారు. అందువల్లే మాదకద్రవ్యాల వైపు చాలామంది వెళ్తున్నారు. మాదకద్రవ్యాలు అత్యంత తీవ్రమైనవి. ఇవి శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మాదక ద్రవ్యాలు తీసుకున్నవారు విపరీతమైన మత్తులో తూగుతూ ఉంటారు. వారిదైన లోకంలో వివరిస్తూ ఉంటారు. సమయానికి ఆ మత్తు పదార్థం దొరకకపోతే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.
ఆ మత్తులోనే వారు విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఘాతుకాలకు కూడా పాల్పడుతుంటారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మత్తు పదార్థాలు తీసుకొని దారుణాలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి ఏటికేడు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పోలీసులు మత్తు పదార్థాలు స్వీకరించిన వాళ్ళని తనిఖీలలో పట్టుకునేవారు. అయితే ఈ తనిఖీలు తాత్కాలిక ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాయి. ఈ మత్తు పదార్థాల వినియోగానికి శాశ్వతం ముగింపు పలకాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధానాన్ని అమలు చేస్తున్నారు.
మత్తు పదార్థాలలో గంజాయిని ఇటీవల కాలంలో విరివిగా వాడుతున్నారు. గంజాయి వాడకాన్ని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనుమాన ఉన్న వారిని యూరిన్ టెస్ట్ కిట్ తో పరీక్షించి.. అప్పటికప్పుడు ఫలితాన్ని నిర్ధారిస్తుంది. సిద్దిపేట, సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లకు యూరిన్ కిట్లను పంపిణీ చేశారు.
మత్తు పదార్థం తీసుకున్నాడని అనుమానం వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి మూత్రాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత అప్పటికప్పుడు టెస్ట్ కిట్ ద్వారా పరీక్షిస్తారు. వచ్చిన ఫలితం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. వాస్తవానికి మత్తు తీసుకున్న వెంటనే వాటి ఆనవాళ్లు శరీరంలో మూత్రం, రక్తం లో ఉంటాయి. ఆ మూత్రాన్ని పరీక్షించి పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటి పరీక్షల వల్ల గంజాయి వాడకం చాలా వరకు తగ్గిపోతుందని పోలీసులు చెబుతున్నారు.