Telangana Panchayat Elections: గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రికా యాజమాన్యం వ్యతిరేక వార్తలు రాసేది. ఒకానొక దశలో కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించింది. ఒకానొక దశలో ప్రతిపక్ష పార్టీలకు విపరీతమైన స్పేస్ ఇచ్చింది. ఆ పత్రిక అధిపతి కూడా ప్రతిపక్ష నాయకులతో వరుసగా ఇంటర్వ్యూలు చేశారు. కెసిఆర్ మీద ఒత్తిడి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో విజయవంతం అయ్యారు కూడా.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నేటితో మూడో దశ కూడా పూర్తికానుంది. సహజంగానే ఎన్నికలు అంటే ఆ పత్రిక యాజమాన్యం శవాల మీద చిల్లర ఏరుకునే తీరు సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ పెయిడ్ ఆర్టికల్స్ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా వ్యవహరిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, ఎటువంటి ఎన్నికలు వచ్చినా సరే ఆ పత్రిక యాజమాన్యం చిల్లర అడుక్కోవడంలో మాత్రం వెనక్కి తగ్గదు. అంతేకాదు రిపోర్టర్ల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే డబ్బులు గుంజాలనే సిద్ధాంతాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉంటుంది. రిపోర్టర్లకు టార్గెట్ విధిస్తూ నరకం చూపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వ ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో భారీగా దండుకుందామని ఆ పత్రికా యాజమాన్యం భావించింది. కానీ వాస్తవం మాత్రం వేరే విధంగా ఉండడంతో ఆ పత్రికా యాజమాన్యం ఒక్కసారిగా షాక్ కు గురైంది. పంచాయతీ ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్ విధానాన్ని అమలు చేద్దామని ఆ యాజమాన్యం భావించింది.. దీనికి తగ్గట్టుగానే రిపోర్టర్లకు సంకేతాలు ఇచ్చింది.. ఒక సర్కులర్ కూడా పంపించింది.. అయితే యాజమాన్యానికి రిపోర్టర్లు షాకిచ్చారు. ఇటీవలనే వార్షికోత్సవం ప్రకటనలు చేసామని.. ఇప్పటికిప్పుడు పెయిడ్ ఆర్టికల్స్ అంటే కుదరదని చెప్పారు.. అంతేకాదు మూకుమ్మడిగా ఈ ఫీల్డ్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆ యాజమాన్యం చేసేదేం లేక సైలెంట్ అయింది.
పెయిడ్ ఆర్టికల్స్ విధానానికి స్వస్తి పలికింది. ఫలితంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎంతో కొంత దండుకుందామని భావించిన ఆ మేనేజ్మెంట్ ఆశలు ఆడియాసలయ్యాయి. ఉద్యోగులకు చెప్పుకునే స్థాయిలో ఆ పత్రిక యాజమాన్యం జీతాలు ఇవ్వదు.. ఉద్యోగులకు పని ప్రదేశంలో సరైన స్థాయిలో సౌకర్యాలు కూడా కల్పించదు. కానీ, దోచుకోవడంలో మాత్రం.. జనం మీద పడి దండుకోడంలో మాత్రం ముందుంటుంది.