Kavitha lion symbol: కల్వకుంట్ల కవిత.. భారత రాష్ట్ర సమితి మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల కూతురు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన కవిత.. అధిష్టానం ప్రభుత్వం ఏం చేసినా మిన్నకున్నారు. అధికారం పోగానే, పార్టీలోని గ్రూపు రాజకీయాలు.. తనకు ప్రాధాన్యం దక్కడం లేదన్న విషయం గుర్తొచ్చింది. దీంతో హరీశ్‌రావు, సంతోష్‌రావు టార్గెట్‌గా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. అన్న కేటీఆర్ తీరును తప్పు పట్టారు. దీంతో అధిష్టానం కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెలీ పదవికి రాజీనామా ఆమోదించాలని కోరుతూ చేసిన ప్రసంగంలో బాధతో వెళ్తున్నానని, ప్రజల్లో గెలిచి వస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని క్లారిటీ ఇచ్చారు.
తండ్రి బాటలో..
తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి వరకు బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చారు. దీంతో కవిత కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరఫున అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింహం గుర్తుపై తమ అభ్యర్థులను పోటీకి నిలపబోతున్నారు. ఇది జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. స్వతంత్ర పార్టీ గుర్తు పొందడానికి సమయం లేకపోవడంతో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తును ఉపయోగించాలని అగ్రనాయకత్వం చర్చలు జరిపి నిర్ణయించింది. ఈ వ్యూహం పార్టీకి క్షేత్రస్థాయిలో గుర్తింపు తెస్తుంది.
సింహమే ఎందుకు?
సింహం చిహ్నం ధైర్యం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. పార్టీకి సరిపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రాష్ట్ర పార్టీలకు ఇలాంటి గుర్తులు పోటీ సాధ్యం చేస్తాయి. ఏఐఎఫ్బీతో ఈమేరకు చర్చలు జరిగినట్లు తెలిసింది. ఇది జాగృతికి స్వతంత్ర గుర్తు లేకుండా కూడా ఓటర్ల మద్దతు సేకరించే అవకాశం. ఫలితంగా, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి పార్టీ ప్రభావాన్ని విస్తరించవచ్చు.
మారనున్న రాజకీయ సమీకరణాలు..
మున్సిపల్ ఎన్నికల్లో కవిత పోటీతో రాజకీయాలు మారనున్నాయి. కవిత ప్రతిపక్ష లీడర్‌గా అధికార కాంగ్రెస్‌కన్నా.. బీఆర్ఎస్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. పదేళ్లలో ఆ పార్టీ చేసిన తప్పులను బయటపెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్లు అంగీకరించారు. ఇక ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. పదేళ్లలో అవినీతి వేళ్లూనుకుపోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రభావం కాంగ్రెస్ పార్టీకన్నా.. బీఆర్ఎస్పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. మాజీ బీఆర్ఎస్ నేత కావడం, బీఆర్ఎస్లో ఇప్పటికీ కవిత సానుభూతిపరులు ఉన్నారు. తండ్రి కేసీఆర్ కూడా కవితపై ప్రేమ ఉంది.
త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రభావం ఏమేరకు ఉంటుంది.. ఏ పార్టీ ఓట్లు చీలుస్తారు అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.