HomeతెలంగాణKonda Surekha : కొండా సురేఖకు ఏమైంది.. మరో వివాదం రచ్చ.. అసలేమైందంటే?

Konda Surekha : కొండా సురేఖకు ఏమైంది.. మరో వివాదం రచ్చ.. అసలేమైందంటే?

Konda Surekha : మంత్రి కొండా సురేఖ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచింది. కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో సినీనటుడు నాగార్జున కుటుంబంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఏకంగా సినీ ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిఒక్కరూ సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఆమె పలు పార్టీల నేతలు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు సరికావంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం సహించేవి కావంటూ కామెంట్స్ చేశారు.

అయితే.. సురేఖ వ్యాఖ్యల్ని నాగార్జున ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా పరువు నష్టం దావా కూడా వేశారు. మంత్రి నిరాధార ఆరోపణలు చేసి తమ కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించారని కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె వరుస కేసులను ఎదుర్కొంటున్నది. అటు.. సమంత కూడా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దని కోరింది. తాము ఇష్టప్రకారమే విడాకులు తీసుకున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ వివాదం అలాగే కొనసాగడంతో చివరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కూడా తనదైన స్టైల్‌లో అప్పీల్ చేశారు. అప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది. దాంతో పీసీసీ చీఫ్ కూడా సినిమా వాళ్లకు అదే అప్పీల్ చేశారు. మంత్రి క్షమాపణలు చెప్పారని, ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.

ఇంకా ఆ వివాదం పూర్తిస్థాయిలో సమసి పోకముందే సురేఖ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఫ్లెక్సీల విషయంలో నేరుగా పోలీసు స్టేషన్‌కే వెళ్లి ఆమె రచ్చ చేసింది. దీంతో ఆమె చేసిన రచ్చ మరోసారి వివాదస్పదమైంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ముందు నుంచి పరకాలతో కొండా ఫ్యామిలీకి రాజకీయ అనుబంధం ఉంది. దాంతో వారు అక్కడ రాజకీయం చేస్తున్నారు.

ముందు నుంచి తాను గెలిచిన నియోకవర్గంపై కాకుండా కొండా దంపతులు పరకాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నారు. అక్కడి కాంగ్రెస్ వ్యవహారాల్లో వారి జోక్యం ఎక్కువగా ఉంది. అందులోనూ ఈ మధ్య చాలా వరకు వివాదాలు కూడా తెరమీదకు వచ్చాయి. ఇక.. తాజాగా దసరా నేపథ్యంలో మరోసారి ఆమె తీరు వివాదానికి దారితీసింది. ఈ వివాదం కాస్త ఫ్లెక్సీల ద్వారా ఏర్పడింది.

పరకాల నియోజకవర్గం పరిధిలోకి గీసుకొండ మండలంలో కొండా మురళీ వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ఫ్లెక్సీల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయన వర్గీయులు కొండా వర్గీయులపై మండిపడ్డారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలను సైతం చింపేశారు. దీంతో ఈ పరిణామం కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ సీఐ కుర్చీలో కూర్చుని పోలీసులనే బెదిరించింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అంతర్గత వివాదంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొండా సురేఖ సీఐ సీట్లో కూర్చుని కమాండింగ్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీపై వివాదస్పదంగా మాట్లాడి ఇరుక్కున సురేఖ.. మరోసారి వివాదంలో చిక్కుకోవడంపై పార్టీలోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర, జాతీయ నాయకత్వం కూడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular